Ad Code

ఒక్కరోజులో రూ.1.25లక్షల కోట్లు ఆవిరైన బెజోస్‌ సంపద !


మెరికా మార్కెట్లను మాంద్యం భయాలు ముంచేశాయి. అంతర్జాతీయ భౌగోళిక అనిశ్చితులతో అగ్రరాజ్య సూచీలు భారీగా పతనమయ్యాయి. ఫలితంగా దిగ్గజ కంపెనీ షేర్లు కుంగాయి. ఒక్క రోజులోనే ప్రపంచ కుబేరుల సంపద భారీగా ఆవిరైంది. ముఖ్యంగా ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ షేర్ల పతనంతో ఆ సంస్థ అధినేత జెఫ్‌ బెజోస్‌ సంపదలో ఏకంగా రూ. 1.25లక్షల కోట్లు ఆవిరయ్యాయి. శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో అమెజాన్‌ షేర్లు 8.8శాతం మేర నష్టాలను చవిచూశాయి. దీంతో జెజోస్‌ నికర సంపద 15.2 బిలియన్‌ డాలర్ల మేర తగ్గి 191.5 బిలియన్‌ డాలర్లకు పడిపోయిందని బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ సూచీ వెల్లడించింది. అమెజాన్‌ అధిపతి ఒక్క రోజులో ఈ స్థాయి నష్టాన్ని చూడటం ఇది మూడోసారి కావడం గమనార్హం. అంతకుముందు 2019 ఏప్రిల్‌ 4న తన విడాకుల ప్రకటన చేసిన నేపథ్యంలో ఆయన సంపద 36 బిలియన్ డాలర్ల మేర కుంగింది. ఆ తర్వాత 2022 ఏప్రిల్‌లోనూ అమెజాన్‌ షేర్లు 14శాతం మేర పతనమైప్పుడు బెజోస్‌కు భారీ నష్టం వాటిల్లింది. శుక్రవారం ఒక్కరోజే ప్రపంచంలోనే 500 మంది అత్యంత సంపన్నుల మొత్తం నికర సంపదలో ఏకంగా 134 బిలియన్‌ డాలర్ల మేర ఆవిరైంది. బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ 6.6 బిలియన్‌ డాలర్లు, ఒరాకిల్‌ కార్పొరేషన్‌ సహ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిస్‌ 4.4 బిలియన్‌ డాలర్ల నష్టాన్ని చవిచూశారు. మెటా అధిపతి మార్క్‌ జుకర్‌బర్గ్‌, గూగుల్‌ సహ వ్యవస్థాపకులు సెర్గీ బ్రిన్‌, ల్యారీ పేజ్‌ 3 బిలియన్‌ డాలర్ల చొప్పున కోల్పోయారు. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ సూచీ ప్రకారం ప్రస్తుతం 235 బిలియన్ డాలర్ల నికర సంపదతో టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. బెజోస్‌ రెండో స్థానంలో ఉండగా.. 182 బిలియన్‌ డాలర్లతో బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. మార్క్‌ జుకర్‌బర్గ్‌, బిల్‌ గేట్స్‌ తర్వాత స్థానాల్లో ఉన్నారు.

Post a Comment

0 Comments

Close Menu