Ad Code

నవోదయాల్లో ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల !


దేశవ్యాప్తంగా ఉన్న జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 'జవహర్‌ నవోదయ విద్యాలయ సెలెక్షన్‌ టెస్ట్‌ (జేఎన్‌వీఎస్‌టీ) 2025' ద్వారా ఆరో తరగతిలో విద్యార్థులకు అడ్మిషన్స్‌ కల్పించనున్నారు. అయితే ఇవి కో-ఎడ్యుకేషనల్ స్కూళ్లు. బాల బాలికలకు వేరు వేరుగా హాస్టల్స్ ఉంటాయి. అక్కడే వారికి భోజనం, హాస్టల్స్ అన్నీ ఉంటాయి. యూనిఫాం, పాఠ్య పుస్తకాలను ఉచితంగా అందిస్తారు. నవోదయకు ఎంపికైన వారు అక్కడ పన్నెండో తరగతి వరకు చదువుకోవచ్చు. తొమ్మిది నుంచి పన్నెండో తరగతి విద్యార్థులు మాత్రం విద్యాలయ వికాస్‌ నిధి కోసం నెలకు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలైతే నెలకు రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ విద్యాలయాల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) వార్షిక పరీక్షలు నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా మొత్తం - 653 ఉన్నాయి. ఏపీలో 13, తెలంగాణలో 9 జేఎన్‌వీలు ఉన్నాయి. ఒక్కో విద్యాలయంలో గరిష్ఠంగా 80 మందికి అవకాశం కల్పిస్తారు. జిల్లాల వారీగా సంబంధిత జేఎన్‌వీల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు 75 శాతం సీట్లు కేటాయిస్తారు. ఏదైన ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్‌ఐఓఎస్‌ నుంచి 2024 సెప్టెంబరు 15 నాటికి 'బి' సర్టిఫికెట్‌ కాంపిటెన్సీ కోర్సు పూర్తిచేసేవారు కూడా అర్హులే. వీటికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు తప్పని సరిగా 2013 మే 1 నుంచి 2015 జూలై 31 మధ్య జన్మించి ఉండాలి. ఆబ్జెక్టివ్‌ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. మొత్త 100 మార్కులకి మూడు సెక్షన్లలో 80 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 2 గంటలు. మెంటల్‌ ఎబిలిటీ టెస్ట్‌లో 40 ప్రశ్నలు అడుగుతారు. దీనికి 50 మార్కులు కేటాయించారు. అర్థమెటిక్‌ టెస్ట్‌, లాంగ్వేజ్‌ టెస్ట్‌ల్లో ఒక్కోదానిలో 20 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో దానికి 25 మార్కులు ఉంటాయి. నెగెటివ్‌ మార్కులు లేవు. మెంటల్‌ ఎబిలిటీ టెస్ట్‌కు గంట, మిగిలినవాటికి ఒక్కోదానికి అర్ధగంట పరీక్ష సమయం ఇస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పరీక్షని తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌, మరాఠీ, ఉర్దూ, ఒరియా, కన్నడ మాధ్యమాల్లో నిర్వహిస్తారు. పరీక్ష సిలబస్ కోసం అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబరు 16. జేఎన్‌వీ సెలెక్షన్‌ టెస్ట్‌ తేదీలు: 2025 జనవరి 18, ఏప్రిల్‌ 12. 

Post a Comment

0 Comments

Close Menu