సుప్రీంకోర్టు బీహార్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఇటీవల రాష్ట్రంలో అనేక బ్రిడ్జిలు ఒకదాని తర్వాత ఒకటి కూలిపోయిన విషయం తెలిసిందే. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో తరచూ బ్రిడ్జి కూలిన ఘటనలపై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. బ్రిడ్జిలు కూలిన ఘటనలపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. ఈ మేరకు పిటిషన్లపై స్పందన తెలియజేయాలంటూ బీహార్ ప్రభుత్వానికి నోటీసులు పంపింది. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న అన్ని వంతెనలు, నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిలపై అత్యున్నత స్థాయి స్ట్రక్చరల్ ఆడిట్ నిర్వహించాలని సూచించింది. అదేవిధంగా సాధ్యాసాధ్యాలను బట్టి బలహీనమైన నిర్మాణాలను కూల్చివేయడం లేదా పునర్నిర్మించడం వంటి చర్యలు చేపట్టాలని నోటీసుల్లో పేర్కొంది. కాగా, సివాన్, సరన్, మధుబని, అరారియా, తూర్పు చంపారన్, కిషన్‌గంజ్ జిల్లాల్లో ఇటీవలే పదుల సంఖ్యలో వంతెనలు కుప్పలకూలిన విషయం తెలిసిందే. వాటిలో కొన్ని వంతెనలు పాతవి కాగా, మరికొన్ని నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిలు. భారీ వర్షాల కారణంగా ఒకదాని తర్వాత ఒకటి కూలిపోయాయి. దీంతో బ్రిడ్జిల నాణ్యతపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.
0 Comments