బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ మరోసారి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా వున్న లాలు ప్రసాద్‌కి డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. సోమవారం వరకు లాలు పాట్నాలోనే వున్నారు. ఆయన అనారోగ్యం తిరగబెట్టడంతో కుటుంబ సభ్యులు ఢిల్లీకి తరలించారు. బిహార్‌లో జరిగిన దాణా కుంభకోణంలో దోషిగా తేలిన ఆయన, ప్రస్తుతం అనారోగ్య కారణాలతో బెయిల్ మీద వున్నారు. లాలు ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందన్న అనుమానాలు కలుగుతూ వుండటంతో ఆయన కుటుంబ సభ్యులందరూ ఆస్పత్రిలోనే వున్నారు. లాలు స్పృహలోనే వున్నారు. ఒక సందర్భంలో కుటుంబ సభ్యులతో 'ఇక చాలు.. చాలా అలసిపోయాను' అని లాలు అన్నట్టు తెలుస్తోంది. లాలు ప్రసాద్ ఎన్నో సంవత్సరాలుగా అనారోగ్య సమస్యలతో పోరాటం చేస్తున్నారు. రెండేళ్ళ క్రితం సింగపూర్‌లో కిడ్నీ మార్పిడి కూడా చేయించుకున్నారు. లాలు కుమార్తె రోహిణి ఆచార్య తండ్రికి కిడ్నీ దానం చేశారు. కిడ్నీ మార్పిడి తర్వాత లాలు కోలుకున్నట్టే కనిపించారు. తనదైన శైలిలో మీడియాతో కూడా మాట్లాడేవారు. అయితే, ఈ మధ్యకాలంలో ఆయన అనారోగ్యం తిరగబెట్టింది.
0 Comments