Ad Code

మద్రాస్‌ ఐఐటీ నుంచి ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ కు పీహెచ్‌డీ పట్టా !


ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ మద్రాస్‌ ఐఐటీ నుంచి పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. శుక్రవారం ఐఐటీ మద్రాస్‌లో జరిగిన 61వ స్నాతకోత్సవంలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో ఆయన డాక్టరేట్‌ను పొందారు. 60 ఏళ్ల వయసులో ఆయన పీహెచ్‌డీ పట్టా అందుకోవడం విశేషం. ఈ సందర్భంగా సోమనాథ్‌ మాట్లాడుతూ మద్రాస్‌ ఐఐటీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థ నుంచి పీహెచ్‌డీ పట్టా అందుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ''ఒక పల్లెటూరిలో పుట్టి పెరిగిన నేను టాపర్‌ అయినప్పటికీ ఐఐటీ ప్రవేశ పరీక్ష రాసే ధైర్యం కూడా చేయలేదు. ఇక్కడి నుంచి గ్రాడ్యుయేషన్‌ చేయాలనే కోరిక మాత్ర ఉండేది. ఆ కల ఇప్పుడు నెరవేరింది. గతంలో ఐఐటీ- బెంగళూరు నుంచి మాస్టర్స్‌ డిగ్రీ అందుకున్నా. విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడే నా జీవితంలో సాధించాల్సిన విషయాలపై శ్రద్ధ పెట్టాలని, వాటిని నెరవేర్చుకునేందుకు నిరంతరం ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాను' అని సోమనాథ్‌ తెలిపారు. కేరళలోని అళప్పుళ జిల్లాలో జన్మించిన సోమనాథ్‌ అదే జిల్లాలో ఆరూర్‌లోని సెయింట్‌ ఆగస్టీన్‌ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యను అభ్యసించారు. ఆ తర్వాత కొల్లంలోని టీకేఎం కళాశాలలో మెకానికల్‌ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌లో ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం ఇస్రో ఛైర్మన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం ఆయన సారథ్యంలోనే జరిగింది.

Post a Comment

0 Comments

Close Menu