పశ్చిమ బెంగాల్‌ను విభజించే అన్ని ప్రయత్నాలను తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిఘటిస్తుందని సీఎం మమతా బెనర్జీ తెలిపారు. సోమవారం ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఈ మేరకు స్పష్టం చేశారు. 'బెంగాల్‌ను విభజించేందుకు వారిని రానివ్వండి. దాన్ని ఎలా అడ్డుకోవాలో వారికి చూపుతాం' అని అన్నారు. బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని జిల్లాలను విభజించి కొత్తగా కేంద్ర పాలిత ప్రాంతం ఏర్పాటు చేయాలని జార్ఖండ్‌కు చెందిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే డిమాండ్ చేశారు. బెంగాల్‌లోని ముర్షిదాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే గౌరీ శంకర్ ఘోష్ కూడా ఈ డిమాండ్‌కు మద్దతు ఇచ్చారు. ఈ నేపథ్యంలో బెంగాల్ విభజనను తీవ్రంగా ప్రతిఘటిస్తామని మమతా బెనర్జీ అన్నారు. కాగా, భారత్-బంగ్లాదేశ్ రివర్ కమిషన్‌కు అనుగుణంగా భారత్-భూటాన్ రివర్ కమిషన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను నీతి ఆయోగ్ సమావేశంలో లేవనెత్తినట్లు మమతా బెనర్జీ తెలిపారు. 'ప్రధాని సమక్షంలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ఈ సమస్యను రికార్డ్ చేశా. పశ్చిమ బెంగాల్ ఆకారం పడవలా ఉన్నందున రాష్ట్రంలో నీటి ఎద్దడి సమస్య చాలా ఎక్కువగా ఉంది. నీతి ఆయోగ్ సమావేశంలో దీనిని హైలైట్ చేశాను' అని అన్నారు. అలాగే బంగ్లాదేశ్‌తో తీస్తా నీటిని పంచుకునే విషయంలో బీజేపీ ఏకపక్ష నిర్ణయం తీసుకుంటోందని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఈ ఒప్పందాన్ని ఎప్పటికీ అంగీకరించబోమని స్పష్టం చేశారు.
0 Comments