ఎలక్ట్రిక్ కార్ల ప్రణాళికలను ఓలా ఎలక్ట్రిక్ నిలిపివేసిందని రాయిటర్స్ సంస్థ పేర్కొంది. ఓలా కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ వ్యాపారంపై దృష్టి పెట్టాలనే ఉద్దేశంలో ఈవీ కార్ల తయారీ ప్రణాళికలను వాయిదా వేసిందని పేర్కొంది. ఓలా కంపెనీ ఐపీఓ కోసం పూర్తిగా సిద్ధంగా ఉన్న సమయంలో ఈ వార్త ఓలా ప్రియులను షాక్‌కు గురి చేసింది. గతేడాది డిసెంబర్‌లో ఓలా ఎలక్ట్రిక్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీకి తన డ్రాఫ్ట్ పేపర్లను దాఖలు చేసింది. షేర్ల ఇష్యూతో పాటు ప్రస్తుతం ఉన్న షేర్ల విక్రయం ద్వారా రూ.5,500 కోట్లు సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది. అయితే కంపెనీ వాల్యుయేషన్ దాని రాబోయే ఐపీఓ కోసం 4.5 బిలియన్ల డాలర్లకు తగ్గించే అవకాశం ఉంది. ఓలా ఎలక్ట్రిక్ 2024 చివరికి అన్ని గ్లాస్ రూఫ్‌తో కూడిన ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును విడుదల చేయాలని ప్లాన్ చేసింది. 2022లో ఓలా వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ ఈ ప్రణాళికను రూపొందించారు. అయితే గతేడాది సెప్టెంబర్‌లో ఈ ప్లాన్‌ను అగర్వాల్ ఉపసంహరించుకున్నారని రాయిటర్స్ తెలిపింది. ప్రస్తుతం ఓలా దృష్టి అంతా ద్విచక్ర వాహనాల మార్కెట్‌పై ఉంది. స్కూటర్లే కాకుండా ఈవీ బైక్‌లను కూడా లాంచ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తుందని రాయిటర్స్ నివేదిక పేర్కొంది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, బ్యాటరీ సెల్స్‌పై దృష్టి సారించడంతో ఓలా కంపెనీ రెండేళ్లపాటు ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్ ప్రాజెక్ట్‌పై పని చేయదని తెలుస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో ఓలా మార్కెట్ వాటా 48 శాతంగా ఉంది. అయితే ఈ సంవత్సరంలో ఓలా కంపెనీ ఐపీఓ కోసం వెళ్లే మొదటి ఎలక్ట్రిక్ వాహన కంపెనీ కూడా అవుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే కంపెనీ నిర్వహణ విషయానికి వస్తే ప్రస్తుతం కంపెనీ నష్టాల్లోనే ఉందని పేర్కొంటున్నారు. 2023 ఆర్థిక సంవత్సరంలో ఓలా ఎలక్ట్రిక్ నికర నష్టం రూ.1,472 కోట్లుగా ఉంటే అంతకుముందు ఏడాది రూ.784.1 కోట్ల నష్టంతో ఉంది.
0 Comments