ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. కొద్దిరోజులుగా వేసవికాలానికి తీసిపోని రీతిలో ఎండలు మండిస్తుంటే ఇబ్బంది పడిన ప్రజానీకం ప్రస్తుతం వాతావరణం చల్లబడటంతో హాయిగా ఊపిరి పీల్చుకుంటోంది. తాజాగా అమరావతి వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతోంది. దీని ప్రభావంతో రానున్న ఐదురోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయి. కొన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు బలపడి రాష్ట్రమంతటా విస్తరించివున్నాయి. రేపు ఏర్పడే అల్పపీడనం విశాఖపట్నం-భువనేశ్వర్ మధ్య తీరాన్ని తాకుతుంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర, మధ్యాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ఈశాన్య అస్సోం నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు ప్రస్తుతం రెండు ద్రోణులు కొనసాగుతుండటంతో సోమ, మంగళవారాల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. రాయలసీమలో తేలికపాటి జల్లలు, ఏలూరు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, ప్రకాశం, చిత్తూరు, నంద్యాల జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయి. విశాఖపట్నం, కడప, కర్నూలు, విజయనగరం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, శ్రీకాకుళం, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో ఆదివారం, సోమవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని, పార్వతీపురం మన్యం, అన్నమయ్య, కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అల్పడీన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో కూడా వర్షాలు కురవనున్నాయి. జగిత్యాల, సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, భూపాలపల్లి, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది.
0 Comments