Ad Code

అడవులు, భూములు, ఖనిజ సంపదపై శ్వేతపత్రం విడుదల !


ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో సహజ వనరులు, అడవులు, ఖనిజ సంపద వింధ్వంసానికి గురైందని, వైసీపీ నేతలు అన్నింటినీ దోచేశారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. సోమవారం సచివాలయంలో అటవీ, సహజ వనరులు, భూమి, గనుల వ్యవహారంపై శ్వేతపత్రం విడుదల చేశారు. కాగా, ఇప్పటికే పోలవరం ప్రాజెక్ట్, రాజధాని అమరావతి, విద్యుత్ రంగంలో వరుసగా మూడు శ్వేతపత్రాలు విడుదల చేసిన ముఖ్యమంత్రి.. తాజాగా నాలుగో శ్వేతపత్రం విడుదల చేశారు. వైసీపీ హయాంలో నూతన విధానం ఏర్పాటు చేసుకుని మరీ దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. విశాఖ, ఒంగోలు, చిత్తూరు జిల్లాల్లో భూకబ్జాలు చేశారని మండిపడ్డారు. ఇళ్ల నిర్మాణం పేరుతో దందా చేశారని.. 23 పార్టీ కార్యాలయాల పేరుతో అక్రమాలు చేశారని అన్నారు. వైసీపీ నేతలు, కార్యకర్తలకు అసైన్డ్ భూములను అప్పగించారని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో భూదోపిడీకి కుట్ర పన్నారని చెప్పారు. మాజీ ఎంపీ ఎంవీవీ అనేక భూ అక్రమాలకు పాల్పడ్డారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఒంగోలులో నకిలీ పత్రాలతో రూ.101 కోట్ల ఆస్తి కాజేసేందుకు యత్నించారని అన్నారు. ఒంగోలు భూ కబ్జాలపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు. 'విశాఖలోని రామానాయుడు స్టూడియో భూములు కొట్టేసేందుకు విఫలయత్నం చేశారు. వృద్ధాశ్రమానికి ఇచ్చిన హయగ్రీవ భూములను సైతం కొట్టేశారు. దస్పల్లా భూములను కాజేసి ఇళ్లు కట్టారు. తిరుపతి, రేణిగుంటలోని మఠం భూములను కొట్టేశారు. తిరుపతి జిల్లాలో 22 - ఏ పెట్టి భూ అక్రమాలు చేశారు. పేదవారి అసైన్డ్ భూములు లాక్కున్నారు. చిత్తూరులో 782 ఎకరాలు కాజేసేందుకు యత్నించారు. గ్రామాల్లో ఉండే ఖాళీ భూములను ఆక్రమించి.. నివాసయోగ్యం కాని ఆవ భూములను ఇళ్లకు కేటాయించారు. అక్రమంగా భవనాలు కట్టేసి.. ప్రశ్నించే వారిపై దాడులు చేశారు. వైసీపీ ప్రభుత్వం దాదాపు 13,800 ఎకరాలను ఆ పార్టీ నేతలకు ఇచ్చింది. ఆ పార్టీ నేతలు తక్కువ ధరకు 40 వేల ఎకరాలు కొన్నారు. అధికారులను బెదిరించి భూములకు పట్టాలు తెచ్చుకునేవారు.' అని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ హయాంలో భూహక్కు పత్రం పేరుతో ప్రచారానికి రూ.13 కోట్లు ఖర్చు చేశారని.. భూముల రీసర్వే పేరుతో జగన్ చిత్రం ముద్రించుకున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎంతో అహంకారంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారని మండిపడ్డారు. ఆ చట్టం దురుద్దేశాలను ప్రజలు గ్రహించారని అన్నారు. 'రాష్ట్రంలో భవిష్యత్తులో భూకబ్జా చేయాలంటేనే భయపడేలా చేస్తాం. ప్రజలు ఒకసారి భూములు చెక్ చేసుకోవాలి. భూములు, ఆస్తులు కబ్జాకు గురైతే ఫిర్యాదు చేయాలి. గుజరాత్లోని ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని ఇక్కడ తీసుకొస్తాం. తాము భూ యజమానులని కబ్జాదారులే నిరూపించుకోవాలి.' అని సీఎం స్పష్టం చేశారు. అటు, మైనింగ్, క్వారీ లీజుల్లోనూ అక్రమాలకు పాల్పడ్డారని.. నిబంధనలు ఉల్లంఘించి గనులు తవ్వేశారని చంద్రబాబు పేర్కొన్నారు. ఇసుక తవ్వకాల్లో ప్రైవేట్ ఏజెన్సీలను తెచ్చి.. అక్రమంగా భారీ యంత్రాలు వాడారని చెప్పారు. కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో భారీ ఇసుక దందాలు జరిగాయని.. ప్రశ్నించే వారిపై అట్రాసిటీ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు రూ.9,750 కోట్లు కొట్టేశారని మండిపడ్డారు. ఏ ప్రభుత్వంలోనైనా అటవీ, గనులశాఖలను సాధారణంగా ఓ వ్యక్తికి ఇవ్వరని.. కానీ వైసీపీ హయాంలో మాత్రం ఆ రెండు శాఖలను ఒకే వ్యక్తికి అప్పగించారని చంద్రబాబు అన్నారు. తూ.గో జిల్లాలో లేటరైట్ గనులు, ప్రకాశం జిల్లాలో 250 క్వారీలపై దాడులు చేశారని ధ్వజమెత్తారు. ప్రకృతి సంపద, అడవులను దోచేశారని.. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడ్డారని ఆరోపించారు. భీమిలి ఎర్రమట్టి దిబ్బలను పూర్తిగా ధ్వంసం చేశారు. గనుల బాధితులు ముందుకొచ్చి ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూముల పరిరక్షణకు ప్రజలంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. అడవులను దోచుకున్న వారిని శిక్షిస్తామని సీఎం స్పష్టం చేశారు.

Post a Comment

0 Comments

Close Menu