హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి 20.3 శాతం వృద్ధితో రూ.4,257 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.3,534 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఆదాయంలో 7శాతం వృద్ధితో రూ.28,057 కోట్లుగా నమోదైనట్లు హెచ్‌సీఎల్ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరుపై రూ.12 చొప్పున మధ్యంతర డివిడెండ్ చెల్లించేందుకు హెచ్‌సీఎల్ బోర్డు ఆమోదం తెలిపింది. జులై 23ను రికార్డు తేదీగా ప్రకటించింది. ఆగస్టు 1న చెల్లింపులు చేయనున్నారు. పన్నులకు ముందు లాభం రూ.4,795 కోట్లుగా ఉంది. గతేడాదితో పోలిస్తే 7 శాతం వృద్ధి నమోదైంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి స్థిర కరెన్సీ ప్రాతిపదికన ఆదాయ వృద్ధి 3-5 శాతం ఉండొచ్చని కంపెనీ పేర్కొంది. ఎబిటా మార్జిన్ 18-19 శాతం ఉండొచ్చని తెలిపింది. స్థిర ధరల వద్ద 6 శాతం ఆదాయ వృద్ధితో మెరుగైన త్రైమాసిక ఫలితాలను ప్రకటించామని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఎండీ, సీఈఓ సి విజయ్ కుమార్ పేర్కొన్నారు. క్యూ1 ఆదాయం, ఎబిటా తమ అంచనాలకు మించి నమోదైందన్నారు. తొలి త్రైమాసికంలో 1.96 బిలియన్ డాలర్ల విలువైన కొత్త డీల్స్‌ను అందుకున్నట్లు తెలిపారు. ఏప్రిల్- జూన్ మధ్య ఉద్యోగుల సంఖ్య 8,080 మేర తగ్గినట్లు హెచ్‌సీఎల్ తెలిపింది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2.19 లక్షలుగా ఉంది. కొత్తగా 1,078 ఫ్రెషర్లను చేర్చుకున్నట్లు కంపెనీ తెలిపింది. వలసల రేటు గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 16.3 నుంచి 12.8 శాతానికి తగ్గింది. ఇదే త్రైమాసికంలో టీసీఎస్‌లో ఉద్యోగుల సంఖ్య 5,452 మేర పెరగడం గమనార్హం.
0 Comments