పొగాకు ఉత్పత్తులపై వార్నింగ్ లేబుల్ ఉన్నట్టే సోషల్ మీడియా యాప్‌లపై కూడా వార్నింగ్ లేబుల్స్‌ను డిస్‌ప్లే చేయాల్సిన అవసరం ఉందని అమెరికా ప్రభుత్వ సర్జన్ జనరల్ వివేక్ మూర్తి అభిప్రాయపడ్డారు. చాలా సోషల్ మీడియా వేదికల వల్ల యువత, టీనేజీ బాలికలు చాలా మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారని వివేక్ మూర్తి చెప్పారు. అందుకే వాటిపై వార్నింగ్ లేబుల్స్‌ను వాడాల్సిన అవసరం ఉందన్నారు. ఈమేరకు వివరాలతో ఆయన 'న్యూయార్క్ టైమ్స్'లో వ్యాసం రాశారు. ''సోషల్ మీడియాను వినియోగించే యువత, టీనేజర్లు మానసికంగా ప్రభావితం అవుతున్నారు. వాళ్లు సోషల్ మీడియాను ఒక పరిమితికి మించి వాడినప్పుడు.. పేరెంట్స్‌ను అలర్ట్ చేసేలా వార్నింగ్ లేబుల్స్ ఉపయోగపడాలి. ఈ మేరకు సోషల్ మీడియా యాప్‌లలో మార్పులు చేయాల్సిన బాధ్యత ఆయా కంపెనీలపై ఉంది. దీనిపై అమెరికా కాంగ్రెస్ చట్టం చేయాల్సిన అవసరం ఉంది'' అని అమెరికా ప్రభుత్వ సర్జన్ జనరల్ వివేక్ మూర్తి వ్యాసంలో ప్రస్తావించారు. 2019 సంవత్సరంలో అమెరికన్ మెడికల్ అసోసియేషన్ విడుదల చేసిన అధ్యయన నివేదిక ప్రకారం.. సోషల్ మీడియాలో ప్రతిరోజు సగటున మూడు గంటల పాటు గడిపే యువత డిప్రెషన్ రిస్క్‌ను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు సోషల్ మీడియా వల్ల పిల్లలు, యువతపై చెడు ప్రభావం పడకుండా నిలువరించే చర్యలను చేపట్టే దిశగా కసరత్తును మొదలుపెట్టాయి. ప్రత్యేకించి సోషల్ మీడియా అతి వినియోగం వల్ల తీవ్ర ఆందోళన, నిరాశ, మానసిక సమస్యలు వస్తున్నాయని అధ్యయన నివేదికలు ఘోషిస్తున్నాయి.
0 Comments