ఒడిశాలో బీజేపీ నిర్వహించిన ఓ వేడుకలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒడిశా ముఖ్యమంత్రిని పూరీలో కొలువైన జగన్నాథుడి పోల్చారు. అంతటితో ఆగకుండా మరో ఇద్దరు మంత్రులను బలభద్రుడు, సుభద్రతలతో పోల్చారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒడిశాలో బీజేపీ 78 స్థానాల్లో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. సీఎం మోహన్ చరణ్ మాఝీ, ఇద్దరు డిప్యూటీ సీఎంలు కేవీ సింగ్ దేవ్, పార్వతీ పరిదాలను జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిలవంటి వారని.. రాష్ట్రాభివృద్ధి బాధ్యత వారిపై ఉందన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశ కలను సాకారం చేసేందుకు కొత్త ఒడిశా దోహదపడుతుందని మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైల్వేశాఖ తరఫున ఒడిశాకు వరాల జల్లు కురిపించారు. వచ్చే ఐదేళ్లలో లక్షల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టు పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని గత బీజేడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రైల్వేరంగంలో ఒడిశా అభివృద్ధిపై గత ప్రభుత్వం ఏనాడూ శ్రద్ధ చూపలేదన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఉందని.. రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో పనులు జరుగుతాయన్నారు. గతంలో ఒడిశాకు భారీ రైల్వే ప్రాజెక్టులు ప్రకటించినా.. బీజేడీ ప్రభుత్వంతో భూసేకరణ ఆలస్యమైందన్నారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టు పనులకు ఊపువస్తుందన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఒడిశాకు రైల్వే బడ్జెట్‌లో రూ.800 కోట్లు కేటాయిస్తే, మోడీ ప్రభుత్వం రూ.10వేలకోట్లు కేటాయించిందని కేంద్రమంత్రి తెలిపారు. గత 10ఏళ్లలో ఒడిశాలో 1,826 కి.మీ రైల్వే లైన్ నిర్మించామని.. ఇది శ్రీలంక మొత్తం రైలు నెట్‌వర్క్ కంటే ఎక్కువ అన్నారు. జగన్నాథ రథయాత్ర సందర్భంగా పూరీకి 315 ప్రత్యేక రైళ్లను నడుపుతామన్నారు. దాంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూస్తామన్నారు.
0 Comments