ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి కోసం ఈనాడు ముందడుగు వేసింది .మొదటి నుంచి రాజధాని రైతుల పక్షాన పోరాటం చేసిన ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మరణం తర్వాత నేడు రామోజీ సంస్మరణ సభలో రామోజీరావు తనయుడు ఈనాడు ఎండి కిరణ్ కీలక ప్రకటన చేశారు. ప్రజా శ్రేయస్సు కోసం ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం రామోజీరావు జీవితాంతం పరితపించారని ఆయన కుమారుడు ఈనాడు ఎండి సిహెచ్ కిరణ్ పేర్కొన్నారు. నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా విజయవాడలోని కానూరులో రామోజీరావు సంస్మరణ సభను ఏర్పాటు చేయగా ఈ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సభకు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సహా మంత్రులు, రామోజీరావు కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. సభలో మాట్లాడిన రామోజీరావు తనయుడు సీహెచ్. కిరణ్ రామోజీరావు సంస్మరణ సభను ఏర్పాటు చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సభ తన తండ్రి ఆలోచనలను, ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లే సంకల్ప సభగా తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. రామోజీరావు ఎప్పుడు ప్రచారాన్ని ఇష్టపడే వారు కాదని, మనం ఏ పని చేసినా ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అన్నది మాత్రమే చూడాలని చెప్పే వారిని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడు ముందుండి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రక్షా కవచంగా నిలిచేవారని, దేశంలో ఎక్కడ విపత్తులొచ్చిన ఆదుకునేందుకు తనవంతుగా సిద్ధంగా ఉండే వారిని గుర్తు చేశారు. తన తండ్రి స్ఫూర్తితో తాము కూడా ఎల్లప్పుడూ ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి ఉంటామని మాటిస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు.అంతేకాదు రాజధాని అమరావతి కోసం ఆయన ఎంతో పరితపించారని, నవ్యాంధ్ర రాజధాని పేరు అమరావతిని రామోజీ రావే సూచించారని గుర్తు చేశారు. ఈ క్రమంలో కిరణ్ అమరావతి అభివృద్ధి కోసం పది కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. దేశంలోనే గొప్ప నగరంగా అమరావతి మారాలన్నది ఆయన ఆకాంక్ష అని పేర్కొన్నారు. అందుకే తాము అమరావతి నిర్మాణానికి 10 కోట్ల విరాళం ప్రకటిస్తున్నట్టు ఈనాడు ఎండి కిరణ్ తెలిపారు. ఇక దీనికి సంబంధించిన చెక్కులను వారు ఏపీ సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అందజేశారు.
0 Comments