ప్రముఖ అమెరికా కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి భారత్ ఐటీ దిగ్గజం విప్రో ఐదేళ్ల కాలానికి 500 మిలియన్ డాలర్ల ( సుమారు రూ.4,175 కోట్లు ) డీల్ పొందినట్లు కంపెనీ ఎక్స్ఛేంజీలకు సమర్పించిన ఫైలింగ్ లో తెలిపింది. ఈ ఒప్పందంలో భాగంగా అమెరికన్ సంస్థకు కొన్ని ఉత్పత్తులు, పరిశ్రమకు సంబంధించిన పరిష్కారాల కోసం నిర్వహణ సేవలను అందించనున్నట్లు కంపెనీ పేర్కొంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను విప్రో వెల్లడించలేదు. కాగా విప్రో కమ్యూనికేషన్ విభాగం 2024 ఆర్థిక సంవత్సరంలో వార్షిక ప్రాతిపదికన 14.7 శాతం క్షీణించింది. మొత్తం ఆదాయంలో 4.2 శాతం ఈ విభాగం నుంచి కంపెనీ లభించింది. 500 మిలియన్ డాలర్ల నుంచి 1 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలు అగ్రశ్రేణి ఐటీ సేవల సంస్థలకు కీలకం. ఎందుకంటే అవి నేరుగా ఆదాయ వృద్ధిని ప్రభావితం చేస్తాయి. నాలుగో త్రైమాసికంలో విప్రో భారీ డీల్ బుకింగ్స్ 9.5 శాతం పెరిగి 1.2 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. వృద్ధిని వేగవంతం చేయడమే విప్రో తక్షణ ప్రాధాన్యత అని కొత్తగా నియమితులైన సీఈవో శ్రీనివాస్ పలియా గత ఎర్నింగ్స్ కాల్ లో చెప్పారు.
0 Comments