2038 జూలై 12న ఓ ప్రమాదకరమైన గ్రహశకలం భూమికి సమీపంలో వచ్చే అవకాశం ఉండడంతో పాటు ఢీకొట్టే ప్రమాదం ఉందని నాసా పేర్కొంది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఐదవ ద్వైవార్షిక ప్లానెటరీ డిఫెన్స్ ఇంటర్ ఏజన్సీ టాబ్లెట్‌టాప్ పరిశోధనలను ఏప్రిల్‌లో నిర్వహించింది. జూన్ 20న మేరీల్యాండ్‌లోని లారెల్‌లోని జాన్స్ హాప్‌కిన్స్ అప్లైడ్ ఫిజిక్స్ లాబొరేటరీ లో చేసిన ఈ పరిశోధనల్లో 2038లో ఓ గ్రహశకలం భూమిని ఢీకొనే అవకాశం 72శాతం ఉన్నట్లుగా కనుగొన్నామని పేర్కొంది. ఈ పరిశోధనలో నాసాతో పాటుగా అమెరికా ప్రభుత్వ ఏజెన్సీలు, అంతర్జాతీయంగా నాసాకు సహకారం అందిస్తున్న పలువురు ప్రతినిధులు పాల్గొన్నారని సంస్థ పేర్కొంది. వాషింగ్టన్‌లోని నాసా ప్లానెటరీ డిఫెన్స్ అధికారులు ఎమెరిటస్, లిండ్లీ జాన్సన్ మాట్లాడుతూ ఈ పరిశోధనల ద్వారా ఇంత వరకు కనుగొనని ఓ గ్రహశకలాన్ని, భవిష్యత్తులో మనం ఎదుర్కోబోయే సవాళ్లను తెలుసుకున్నట్టు తెలిపారు. కొన్ని ఏళ్ల అనంతరం ఒక పెద్ద గ్రహశకలం భూమిని ఢీకొనే ప్రమాదం పొంచి ఉందనే విషయాన్ని మనం ఇప్పుడే తెలుసుకోగలిగే సాంకేతికత మనకు అందుబాటులో ఉందని పేర్కొన్నారు. గ్రహశకలం పరిమాణం, దాని మార్గాన్ని కనుగొనడానికి మరికొన్ని పరిశోధనలు చేయాల్సి ఉంటుందని నాసా తెలిపింది. ఒక కైనెటిక్ ఇంపాక్టర్ గ్రహశకలం మార్గాన్ని మార్చగలదని డార్ట్ ధృవీకరించిందని దీనికోసం ఎన్‌ఈఓ సర్వేయర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లుగా సంస్థ వెల్లడించింది.
0 Comments