Ad Code

కృత్రిమ మేధతో ఉద్యోగాల వెల్లువపై భిన్న వాదనలు !


కంప్యూటర్ల రాకతో ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయని అంతా భయపడ్డారు. కానీ, ఇప్పుడు అదే కంప్యూటర్‌ కొత్త పుంతలు తొక్కి లక్షల ఉద్యోగాలు తెచ్చింది. ఇదే మాదిరిగా కృత్రిమ మేధపైనా అపోహలు పెట్టుకుంటున్నారని చెబుతున్నారు నిపుణులు. మనిషి మేధస్సుకు ప్రత్యామ్నాయంగా చెబుతున్న ఏఐతో మానవ ప్రమేయం తగ్గిపోతుందా? అంతా టెక్నాలజీయే చూసుకుంటుందా? మరి ఆ టెక్నాలజీని మేనేజ్‌ చేసేవారు ఎవరు?. అనవసర భయాలు, అర్థంలేని అపోహలు కృత్రిమ మేధపై గందరగోళం సృష్టిస్తున్నట్లు చెబుతున్నారు. ఏఐతో లాభమా? నష్టమా అనే అంశంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ప్రపంచ కుభేరుడు, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ వంటివారు ఏఐ వల్ల భవిష్యత్​లో అందరూ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తుంటే, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్’​ అనే పదమే తప్పని, దానిని ‘డిఫరెంట్​ ఇంటెలిజెన్స్’​గా పిలిస్తే బాగుండేదని మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో ఇన్ఫోసిస్‌ సీటీవో రఫీ తరఫ్​దార్ మాత్రం కృత్రిమ మేధను సమర్థవంతంగా అర్థం చేసుకోగలిగిన వారి భవిష్యత్ చాలా బాగుంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం జాబ్​ వరల్డ్​ రెండు విభాగాలుగా నిపుణులు విభజిస్తున్నారు. ఒక విభాగంలో ఏఐ సృష్టికర్తలు ఉంటే, మరోదానిలో ఏఐ వినియోగదారులు ఉన్నారు. అందుకే దాదాపు అన్ని కంపెనీలు ఈ రెండు విభాగాల్లో సమర్థుల కోసం ఎదురుచూస్తున్నాయి. సాఫ్ట్​వేర్ ఇంజినీరింగ్ బ్యాక్​గ్రౌండ్​లేకుండా వచ్చేవాళ్లు ఏఐ టెక్నాలజీని సమర్థవంతంగా ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకునే వారికి తక్షణం ఉద్యోగాలు వస్తున్నాయట !. అందుకే ఇంజినీరింగ్ బ్యాక్​గ్రౌండ్​ నుంచి వచ్చివారు ఏఐ సృష్టికర్తలుగా మారాలని, నైపుణ్యాలను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు ఇటీవల కాలంలో ఐటీ ప్రొఫెషనల్స్‌ ఉద్యోగ ఎంపిక విధానమూ మారినట్లు చెబుతున్నారు. ఏఐ స్కిల్స్ ఉన్న ఫ్రెషర్లను సగానికిపైగా క్యాంపస్​ వెలుపల నుంచే తీసుకుంటున్నారు. గత నెల ఇన్ఫోసిస్‌ ఇదే విధానాన్ని అమలు చేసింది. ఈ పద్ధతిని అనుసరించేందుకు మరిన్ని కంపెనీలు సిద్ధమవుతున్నాయని చెబుతున్నారు. ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీపై ట్రైనింగ్ ఇస్తున్నాయి. ఇందుకోసం భారీగా డబ్బులు ఖర్చు పెడుతున్నాయి. ఇప్పటికే ఇన్ఫోసిస్​లోని 2 లక్షల 50 వేల మంది ఉద్యోగులకు జెన్​ ఏఐ టెక్నాలజీపై శిక్షణ ఇచ్చారు. మరోవైపు మిగతా కంపెనీలు కూడా ఏఐ నైపుణ్యాలు కలిగిన వ్యక్తులనే ఎక్కువగా నియమించుకుంటున్నాయి. ఇలా ఐటీ కంపెనీలు క్రమంగా తమ ఉద్యోగులకు ఏఐ సామర్థ్యంపై శిక్షణ ఇస్తూ ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నాయి. ఇదే సమయంలో ఆహారం, రోబోటిక్స్, యంత్ర పరిశ్రమ, వైద్యం, విద్య, ఆటలు, వాణిజ్యం, ఈ-కామర్స్, సైబర్‌ భద్రత తదితర రంగాల్లో కృత్రిమ మేధను విరివిగా వాడుతున్నట్లు చెబుతున్నారు. వచ్చే ఐదేళ్లలో కృత్రిమ మేధపై పరిశోధనల కోసం కేంద్ర ప్రభుత్వం పదివేల కోట్ల రూపాయలకు పైగా కేటాయించింది. వీటిలో రెండు వేల కోట్ల రూపాయలను కృత్రిమ మేధ ఆధారిత సాంకేతికతల అభివృద్ధికి ప్రోత్సాహకంగా ఇవ్వాలని నిర్ణయించింది. ఐతే కృత్రిమ మేధ అభివృద్ధికి అవసరమైన శాస్త్రవిజ్ఞానం, కంప్యూటర్‌ ప్రోగ్రాములు రాయగల సామర్థ్యాలను విద్యార్థులు అలవర్చుకోవాల్సివుంది. ఇప్పటికే అమెరికా, చైనా, ఇజ్రాయెల్‌లలో కృత్రిమ మేధపై పెద్దఎత్తున పరిశోధనలు చేస్తున్నారు. మన దేశంలో కూడా ఈ పరిశోధలను ప్రారంభించినా యువతలో సామర్థ్యాల పెంచే విషయంలో కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సివుంటుంది. అప్పుడే ఏఐ అవకాశాలను అందిపుచ్చుకునే చాన్స్‌ ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Post a Comment

0 Comments

Close Menu