యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు డ్రెస్ కోడ్ తప్పనిసరి చేశారు. యాదాద్రిలో ఇప్పటికే ఆలయ ఈవోతో పాటు సిబ్బంది కూడా డ్రెస్ కోడ్ పాటిస్తున్నారు. నరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు కూడా అదే విధంగా సంప్రదాయ దుస్తులు ధరించేలా నిబంధనలు విదించాలని యాదగిరిగుట్ట దేవస్థానం నిర్ణయించింది. వివిధ సేవల్లో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాలనే నిబంధన జూన్ 1 నుంచి అమల్లోకి తీసుకువస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగానే యాదాద్రిలో కూడా భక్తుల వీఐపీ బ్రేక్ దర్శనానికి డ్రెస్ కోడ్ తప్పనిసరి చేసింది. స్వామివారి విరామ దర్శనానికి వచ్చే భక్తులకు ఈ నిబంధన తప్పనిసరిగా వర్తిస్తుందని తెలిపారు యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో భాస్కర్‌రావు. ఈ నిబంధన ప్రకారం నిత్య కల్యాణం, హోమం, జోడు సేవ, శ్రీ సుదర్శన నారసింహ హోమం, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాల్లాంటి కార్యక్రమాల్లో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ వస్త్రాలు ధరించాలి. హిందూ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించేలా చర్యలు తీసుకోవాలని యాదగిరిగుట్ట దేవస్థానం నిర్ణయించింది. ఆలయంలో ఆధ్యాత్మికత, భక్తి భావాన్ని పెంపొందించేందుకే ఇలాంటి నిబంధనలు అమలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
0 Comments