Ad Code

వన్‌ప్లస్‌కు సౌత్‌ ఇండియా ఆర్గనైజ్డ్‌ రిటైలర్స్‌ అసోసియేషన్‌ హెచ్చరిక !


మే 1 నుంచి వన్‌ ప్లస్‌ స్మార్ట్‌ ఫోన్‌, ట్యాబ్లెట్లు, టీవీలు సహా ఇతర ఉత్పత్తుల విక్రయాలను తమ ఆఫ్‌ లైన్ స్టోర్లలో నిలిపి వేస్తామని సౌత్‌ ఇండియా ఆర్గనైజ్డ్‌ రిటైలర్స్‌ అసోసియేషన్‌ వన్‌ ప్లస్‌ను హెచ్చరించింది. వన్‌ ప్లస్‌ ఉత్పత్తుల విక్రయాల వల్ల పెద్దగా మార్జిన్లు రావడం లేదని మరియు విక్రయం అనంతరం వచ్చిన సమస్యలను వన్‌ ప్లస్‌ సంస్థ పరిష్కరించడం లేదని సౌత్‌ ఇండియా ఆర్గనైజ్డ్‌ రిటైలర్స్‌ అసోసియేషన్‌  ఆరోపించింది. ఈ మేరకు వన్‌ ప్లస్‌ సేల్స్‌ డైరెక్టర్‌ రంజిత్‌ సింగ్‌కు లేఖ రాసింది. వన్‌ ప్లస్ ఉత్పత్తుల విక్రయం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నట్లు అసోసియేషన్‌ లేఖలో పేర్కొంది. వన్‌ ప్లస్‌ ఉత్పత్తుల వారెంటీ, సర్వీస్‌ ప్రాసెసింగ్‌ను ఆలస్యం చేస్తున్నారని, అందువల్ల కస్టమర్లు తమపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, ఫలితంగా తమపైనే ఆర్థిక భారం పడుతోందని సౌత్‌ ఇండియా ఆర్గనైజ్డ్‌ రిటైలర్స్‌ అసోసియేషన్‌ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ అంశాలను ఎన్నోసార్లు సంస్థ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని లేఖలో తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాలకు చెందిన సభ్యులు హైదరాబాద్‌లో బుధవారం సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా ఈ రాష్ట్రాల్లో ఈ అసోసియేషన్‌కు చెందిన సుమారు 4500 ఆఫ్‌ లైన్‌ స్టోర్లలో వన్‌ప్లస్‌ ఉత్పత్తుల విక్రయాలు నిలిచిపోనున్నాయి. తాము ఎదుర్కొంటున్న సమస్యలను సంస్థ దృష్టికి తీసుకెళ్లి సంవత్సరం గడుస్తున్నా పరిష్కారం లభించలేదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సౌత్‌ ఇండియా ఆర్గనైజ్డ్‌ రిటైలర్స్‌ అసోసియేషన్‌ వెల్లడించింది. ఈ సమస్యల కారణంగా కస్టమర్లకు మెరుగైన సర్వీసులు అందించలేకపోతున్నామని లేఖలో పేర్కొంది. అందువల్లనే తప్పనిసరి పరిస్థితిలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సౌత్‌ ఇండియా ఆర్గనైజ్డ్‌ రిటైలర్స్‌ అసోసియేషన్‌ తన లేఖలో తెలిపింది. ఫలితంగా మే 1 నుంచి ఈ రాష్ట్రాల్లోని ఆఫ్‌ లైన్‌ స్టోర్‌లలో వన్‌ ప్లస్‌ ఉత్పత్తుల విక్రయం నిలిచిపోనుంది. ఈ అసోసియేషన్‌లో సంగీత, బిగ్‌సి, బిన్యూ, పూర్విక, హ్యాపీ సహా మొత్తం 23 రిటైయిల్‌ సంస్థలు ఉన్నాయి.


Post a Comment

0 Comments

Close Menu