విప్రో సంస్థ ఉద్యోగులకు ప్రమోషన్లు ప్రకటించింది. ఆరుగురు ఉద్యోగులను సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పోస్టులకు, మరో 25 మందిని వైస్ ప్రెసిడెంట్ పోస్టులకు ప్రమోట్ చేసినట్లు అంతర్గత మెమోలను ఉటంకిస్తూ రాయిటర్స్ పేర్కొంది. దేశంలో నాలుగో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సేవల కంపెనీ అయిన విప్రో నుంచి ఉన్నత స్థాయి నిష్క్రమణల పరంపర తర్వాత సీనియర్-స్థాయి అట్రిషన్‌ను నిరోధించే చర్యగా ఈ ప్రమోషన్లను పరిశ్రమ పరిశీలకులు భావిస్తున్నారు. సీనియర్ వైస్ ప్రెసిడింట్‌గా పదోన్నతి పొందిన చీఫ్ డెలివరీ ఆఫీసర్ అజిత్ మహాలే, హెల్త్‌కేర్ పోర్ట్‌ఫోలియో లీడర్ అనూజ్ కుమార్, క్యాప్కో సీఎఫ్‌ఓ బెంజమిన్ సైమన్, కెనడా కంట్రీ హెడ్ కిమ్ వాట్సన్, యూరప్ క్లౌడ్ సేల్స్ హెడ్ శ్రీనివాసా హెచ్‌జి, క్లౌడ్ ఆర్మ్ స్ట్రాటజీ అండ్ ఎగ్జిక్యూషన్ ఆర్మ్ హెడ్ సతీష్ వై ఉన్నారు. గత సంవత్సరం ఫైనాన్స్ చీఫ్ జతిన్ దలాల్, చీఫ్ గ్రోత్ ఆఫీసర్ స్టెఫానీ ట్రాట్‌మాన్, డిజిటల్ అండ్ క్లౌడ్ హెడ్ భరత్ నారాయణన్ సహా చాలా మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు విప్రోను వీడారు. నియామక సంస్థ ఎక్స్‌ఫెనో డేటా ప్రకారం.. దేశంలోని ఐటీ, కన్సల్టింగ్ కంపెనీలలో అసిస్టెంట్ వైస్ ప్రెసిడింట్, వైస్ ప్రెసిడింట్, సీనియర్ వైస్ ప్రెసిడింట్ పోస్టుల సంఖ్య 2024 ఆర్థిక సంవత్సరంలో 11 శాతంగా ఉంది. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 4 శాతం తగ్గింది. కాగా ప్రమోషన్ల అంశాన్ని విప్రో యాజమాన్యం సైతం ధ్రువీకరించింది. "బలమైన అంతర్గత నాయకులను అభివృద్ధి చేయడంలో కొనసాగుతున్న నిబద్ధత"లో ఇది భాగమని తెలిపింది. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంస్థ తక్కువ మంది సీనియర్ ఉద్యోగులను ప్రమోట్ చేసింది. 2023 జనవరిలో విప్రో రికార్డు స్థాయిలో 73 మంది ఉద్యోగులను ప్రమోట్ చేసింది. వీరిలో 12 మందిని సీనియర్ వైస్ ప్రెసిడింట్ స్థాయికి, 61 మందిని వైస్ ప్రెసిడెంట్ స్థాయికి పదోన్నతి కల్పించింది.
0 Comments