ఐబీఎం రిమోట్‌గా ప్రస్తుతం పని చేస్తున్న మేనేజర్‌లకు కార్యాలయం సమీపంలోకి వెళ్లడానికి లేదా కంపెనీని విడిచిపెట్టడానికి కంపెనీ వ్యాప్త అల్టిమేటం జారీ చేసింది. జనవరి 16న పంపిన మెమో ప్రకారం మేనేజర్‌లు వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసు లేదా క్లయింట్ లొకేషన్‌కు తక్షణమే రిపోర్ట్ చేయాలని తెలిపింది. అమెరికాలో విధులు నిర్వహిస్తున్న మేనేజర్లకు, హెచ్‌ఆర్ విభాగంలో పనిచేస్తున్న సిబ్బందికి జనవరి 16న ఐబీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జాన్ గ్రాంజెర్ ఓ ఇంటర్నల్ మెయిల్ పంపారు. అందులో 'ప్రస్తుతం మీరు ఎక్కడ పనిచేస్తున్నారో సంబంధం లేకుండా ఆఫీస్ లేదా క్లయింట్ లొకేషన్‌లో కనీసం వారానికి మూడు రోజులు విధులు నిర్వహించాలని' పేర్కొన్నట్లు మీడియా సంస్థ బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. 2024 ఆగస్ట్ నుంచి 80 కిలోమీటర్ల లోపు ఇంటి వద్ద నుంచి ఉద్యోగులు స్థానిక ఐబీఎం కార్యాలయాల నుంచి పనిచేయాల్సి ఉంటుంది. అనారోగ్య సమస్యలు, మిలటరీ సర్వీసుల్లో పనిచేస్తున్న ఐబీఎం ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చింది. ఒకవేళ రిమోట్‌గా పనిచేస్తున్న మేనేజర్లు క్లయింట్ లొకషన్ లేదంటే లోకల్ ఆఫీస్‌కు వచ్చేందుకు అంగీకరించకపోతే ఐబీఎంకు రాజీనామా చేయాల్సి ఉంటుందని గ్రాంజర్ మెయిల్ లో స్పష్టం చేశారు. గత ఏడాది జనవరిలో 3,900 మందికి కంపెనీ లేఆఫ్స్ ఇచ్చింది. ఈ ఏడాది సైతం వర్క్ ఫోర్స్‌ను తగ్గించే పనిలో పడిందని సమాచారం. 2022 చివరి నాటికి ఐబీఎంలో ప్రపంచ వ్యాప్తంగా 288,000 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, కరోనా ప్రారంభమైనప్పటి నుండి ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ కల్పించింది. తిరిగి ఇప్పుడు రిమోట్‌గా పనిచేస్తున్న ఉద్యోగుల్ని కార్యాలయాలకు రావాలని ఉద్యోగులకు స్పష్టం చేసింది.
0 Comments