Ad Code

మనం 'అంత కష్టపడక్కర్లేదు'


మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ బిల్‌గేట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ పై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. పాడ్‌కాస్ట్, మిషన్లతో చేయాల్సిన రోజువారీ పనుల భారాన్ని అవే పూర్తి చేస్తున్నాయని, మనుషులు అంత కష్టపడాల్సిన అవసరం ఉండదని అభిప్రాయపడ్డారు. ప్రముఖ హాస్యనటుడు ట్రెవర్ నోహ్ హోస్ట్‌గా నిర్వహించిన 'వాట్ నౌ' షోలో బిలిగేట్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రెవర్ ఆయన్ను రాబోయే రోజుల్లో ఏఐ టెక్నాలజీతో మానవులకు ఎదురుకాబోయే ముప్పుపై అనేక ప్రశ్నలను అడిగారు. సాధారణంగా మైక్రోసాఫ్ట్ అధినేత వ్యాపారానికి సంబంధించి విషయాలు మాత్రమే కాదు.. ఏఐ టెక్నాలజీపై మరెన్నో అభిప్రాయాలను వ్యక్తపరుస్తుంటారు. తన జీవితంలో రెండు దశాబ్దాలకు పైగా 18 నుంచి 40 ఏళ్ల వరకు మైక్రోసాఫ్ట్ కంపెనీని నిర్మించడంలో 'మోనో-మానికల్'గా వ్యవహరించినట్లు బిల్‌గేట్స్ చెప్పారు. ఇప్పుడు, 68 ఏళ్ల వయస్సులో తాను 'జీవిత లక్ష్యం కేవలం ఉద్యోగాలు చేయడమే కాదు' అని గ్రహించినట్టు తెలిపారు. చివరికి వారానికి మూడు రోజులు పని విధానం అమల్లోకి వచ్చినా సరే అది మనం చేయాల్సిన పని కాదని నోహ్‌తో బిల్‌గేట్స్ అన్నారు. ఎందుకంటే యంత్రాలు అన్ని ఆహారాన్ని, వస్తువులను అవే తయారు చేయగలవని, దానికి మనం కష్టపడాల్సిన అవసరం లేదని చెప్పారు. సాధారణంగా గతంలోని ఇంటర్వ్యూలు, బ్లాగ్ పోస్ట్‌లలో ఏఐ నష్టాలు, ప్రయోజనాలపైనే బిల్‌గేట్స్ ఎక్కువగా ప్రస్తావిస్తుంటారు. 2023 జూలైలో షేర్ చేసిన పోస్ట్‌లో ఏఐ వల్ల కలిగే ప్రమాదాలను ప్రస్తావించారు. ఏఐ సంభావ్య ప్రమాదాలలో తప్పుడు సమాచారం, డీప్‌ఫేక్‌లు, సెక్యూరిటీ థ్రెట్స్, జాబ్ మార్కెట్‌లో మార్పులు, విద్యపై ఏఐ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. కొత్త టెక్నాలజీ ఏదైనా లేబర్ మార్కెట్‌లోకి వచ్చినప్పుడు మార్పు రావడం ఇదేం మొదటిసారి కాదన్నారు. ఏఐ ప్రభావం పారిశ్రామిక విప్లవం మాదిరిగా నాటకీయంగా ఉంటుందని తాను అనుకోనని చెప్పారు. కానీ, ఇది కచ్చితంగా కంప్యూటర్ ఆవిర్భావానికి మించి పెద్దదిగా ఉంటుందని అన్నారు. ఏఐ భవిష్యత్తు కొంతమంది అనుకున్నంత భయంకరమైనది లేదా ఇతరులు అనుకున్నంత తేలికగా ఉండదన్నారు. కొత్త టెక్నాలజీతో ఎదురయ్యే ప్రమాదాలు నిజమైనవే కానీ వాటిని మనుషులు సులభంగా మ్యానేజ్ చేయగలరని భావిస్తున్నానని బిల్‌గేట్స్ చెప్పుకొచ్చారు. ప్రస్తుత రోజుల్లో కేవలం 2 శాతం మంది అమెరికన్లు వ్యవసాయంలో పాల్గొంటున్నారని, సంప్రదాయ అభిప్రాయాలకు దూరంగా ఉందని తెలిపారు. మార్చిలో 'ది ఏజ్ ఆఫ్ ఏఐ ఈజ్ బిగిన్' అనే బ్లాగ్ పోస్ట్‌లో విద్యలో విప్లవాత్మక మార్పులు చేసే ఏఐ-ఆధారిత సాఫ్ట్‌వేర్ సామర్థ్యంపై గేట్స్ తన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 1980లలో గ్రాఫికల్ యూజర్ ఇంటర్‌ఫేస్‌కి సమానంగా రూపొందించిన చాట్‌జీపీటీని ఒక అద్భుతమైనదిగా ఆయన మెచ్చుకున్నారు. జీపీటీ మోడల్‌తో తరువాతి దశాబ్దంలో ఈ ఏఐ ఆధారిత టూల్స్ తక్కువ-ఆదాయ దేశాలు, అట్టడుగు వర్గాలకు కూడా అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. సాంకేతిక మార్పుకు అనుగుణంగా ప్రభుత్వం మద్దతు ఇస్తే.. అది సానుకూలంగా ఉంటుందని గేట్స్ సూచించారు. సామరస్యపూర్వక పరివర్తన కోసం కొత్త నైపుణ్యాలను సంపాదించడంలో ప్రాముఖ్యతను బిల్‌గేట్స్ నొక్కి చెప్పారు.

Post a Comment

0 Comments

Close Menu