Ad Code

థ్రెడ్స్‌ యాప్‌లో ఎడిట్ ఫీచర్ !


X (ట్విట్టర్) ప్లాట్‌ఫామ్‌కు పోటీగా మెటా థ్రెడ్స్‌ యాప్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ అప్లికేషన్ మొదట్లో టెక్ వరల్డ్‌లోనే హాట్ టాప్‌గా మారింది. కానీ కాలక్రమేణా యాప్ ట్రాఫిక్, ఎంగేజ్‌మెంట్ 75 శాతానికి పైగా తగ్గిపోయింది. ఈ క్రమంలో యూజర్లను ఆకట్టుకునేందుకు థ్రెడ్స్ కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పుడు పోస్ట్‌లను షేర్ చేసిన 5 నిమిషాలలోపు ఎడిట్ చేసుకునే ఫెసిలిటీని ఆఫర్ చేస్తోంది. X ఇప్పటికే పోస్ట్ ఎడిటింగ్‌ సదుపాయాన్ని అందిస్తుంది. కాకపోతే ఆ ఫీచర్ X ప్రీమియం సబ్‌స్క్రైబర్‌ల కోసం మాత్రమే అందుబాటులో ఉంది. పోస్ట్‌లను పోస్ట్ చేసిన గంటలోపు ఎడిట్ చేసుకోవచ్చు. అయితే వినియోగదారులందరికీ పోస్ట్ ఎడిటింగ్‌ను పూర్తిగా ఉచితంగా అందించాలని థ్రెడ్స్‌ యోచిస్తోంది. థ్రెడ్స్‌లో కొత్త ఎడిట్ ఫీచర్ స్క్రీన్‌షాట్‌ను ప్రముఖ లీకర్, డెవలపర్ అలెశాండ్రో పలుజ్జీ తాజాగా షేర్ చేశారు. అందులో ఎడిట్ బటన్ కనిపించింది. ఈ స్క్రీన్‌షాట్‌కు క్యాప్షన్‌గా "5 నిమిషాలలోపు పోస్ట్‌లను ఎడిట్ చేసుకోగల సామర్థ్యంపై థ్రెడ్స్‌ పని చేస్తోంది." అని జత చేశారు. ఇన్‌స్టాగ్రామ్ ఎడిట్ చేసిన క్యాప్షన్‌లను ఎలా చూపుతుందో, అదే విధంగా పోస్ట్‌కు చేసిన ఎడిట్ హిస్టరీ కూడా యూజర్లు చూడగలుగుతారని పలుజ్జీ తెలిపారు. అయితే ఈ ఫీచర్ యూజర్లకు ఇంకా అందుబాటులో రాలేదు, భవిష్యత్తులో రిలీజ్ కావచ్చు. మెటా అధికారికంగా ఎడిట్ పోస్ట్ ఫీచర్‌ను ప్రకటించలేదు. ఇన్‌స్టాగ్రామ్ చీఫ్ ఆడమ్ మోస్సేరి ఈ ఏడాది జులై నెలలో మాట్లాడుతూ.. పోస్ట్‌లను ఎడిట్ సామర్థ్యంతో సహా థ్రెడ్స్‌ కోసం హ్యాష్‌ట్యాగ్స్‌, సెర్చ్, డైరెక్ట్ మెసేజ్‌లు, క్రోనాలాజికల్ ఫీడ్ వంటి కొత్త ఫీచర్‌లపై మెటా పనిచేస్తోందని పేర్కొన్నారు. దీన్ని బట్టి ఎడిట్ ఫీచర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ట్విట్టర్ లాంటి హ్యాష్‌ట్యాగ్స్‌, ట్రెండింగ్ పేజీని పరిచయం చేయడానికి థ్రెడ్స్‌ డెవలపర్లు పనిచేస్తున్నారని కూడా మోస్సేరి చెప్పారు. యూజర్లు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ అవ్వకుండా థ్రెడ్స్‌ ప్రొఫైల్‌ను డిలీట్ చేసుకునే ఫెసిలిటీని అందించాలని మెటా సన్నాహాలు చేస్తున్నట్లు గతంలో రిపోర్ట్స్ వచ్చాయి. ఇదే నిజమైతే, ఇన్‌స్టా-థ్రెడ్స్‌ అకౌంట్ లింక్‌ను విమర్శించిన యూజర్లు సంతోషిస్తారు. ట్విట్టర్ లాగా థ్రెడ్స్‌లో ఎక్కువ మంది వ్యక్తులు అనామక అకౌంట్లను క్రియేట్ చేయడానికి కూడా ఈ ఫెసిలిటీ దారితీయవచ్చు. థ్రెడ్స్ యాప్ లాంచ్ అయిన కొత్తలో పది కోట్ల యాక్టివ్ యూజర్స్ ఉంటే, ఇప్పుడు ఈ సంఖ్య రెండు కోట్ల కంటే తక్కువకు పడిపోయింది. ఫస్ట్ డేస్‌లో దీనికి బాగా హైప్‌ రావడంతో కోట్లమంది యూజర్లు అకౌంట్స్ ఓపెన్ చేసుకున్నారు. సరైన ఫీచర్లు లేక, యాప్ ఆకట్టుకోవడంలో విఫలం కావడంతో యూజర్లు మళ్ళీ ఎక్స్(X)కే షిఫ్ట్ అవుతున్నారు.

Post a Comment

0 Comments

Close Menu