Ad Code

రివార్డు 360 వెబ్‌సైట్‌ హ్యాక్ చేసి గిఫ్ట్ వోచర్లు చోరీ చేసిన టెకీ !


బొమ్మలూరు లక్ష్మీపతి అనే యువ టెకీ ఓహెచ్డీఎఫ్సీ  బ్యాంక్‌, స్టాండర్డ్ ఛార్టర్డ్‌ బ్యాంక్‌, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ మరియు పేబ్యాక్‌ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న రివార్డు 360 వెబ్‌సైట్‌ను హ్యాకింగ్‌ చేశాడు. ఏకంగా రివార్డులు, గిఫ్ట్‌ వోచర్లు ఇచ్చే సంస్థ వెబ్‌సైట్‌ను హ్యాక్‌చేసి వాటితో బంగారం, బైక్‌లు, ఖరీదైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు కొనుగోలు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ సంవత్సరం జనవరి నుంచి జూన్ మధ్య సుమారు 5 లక్షల గిఫ్ట్‌ వోచర్లను దొంగలించినట్లు పోలీసులు చెబుతున్నారు. అమెజాన్‌, ఫ్లిప్‌కార్టుల్లో రూ.4.16 కోట్ల విలువైన వస్తువుల కోసం ఈ గిఫ్ట్‌ వోచర్లను రీడిమ్‌ చేసినట్లు తెలిపారు. నిందితుడు లక్ష్మీపతి నుంచి 5.269 కిలోల స్వచ్ఛమైన బంగారం కడ్డీలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ బంగారం విలువ రూ.3.4 కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. లక్ష్మీపతి కాలేజీ రోజుల్లోనే ప్రైవేటు సెక్టార్ బ్యాంకుల నుంచి డెబిట్‌, క్రెడిట్‌ కార్డులను పొందేవాడని, అప్పటి నుంచే ఇదంతా ప్రారంభమైందని బెంగళూరు డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్ పోలీస్‌ సీకే బాబా తెలిపారు. రివార్డు పాయింట్లు ఇచ్చేందుకు బ్యాంకు అంగీకరించని నేపథ్యంలో వారి సర్వర్‌లను దోపిడీ చేసేందుకు ప్రత్యేక టెక్నాలజీని అభివృద్ధి చేశాడని పోలీసులు తెలిపారు. వెబ్‌సైట్‌ హ్యాక్‌చేసి వోచర్లతో అధిక మొత్తాన్ని డిజిటల్‌ కరెన్సీగా మార్చాడని గుర్తించామని పోలీసులు తెలిపారు. అనంతరం బంగారం, వెండి వంటి వాటిపై పెట్టుబడి పెట్టినట్లు గుర్తించినట్లు తెలిపారు. రివార్డులు, గిఫ్ట్‌ వోచర్లు పొందిన యజమానులు వాటిని వినియోగించకముందే, లక్ష్మీపతి వాటిని దొంగలించి ఖర్చుచేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. జూన్‌ 24న రివార్డు360 డైరెక్టర్‌ పోలీసులు ఫిర్యాదు చేశారు. వినియోగదారులకు ఇచ్చిన గిఫ్ట్‌ వోచర్‌లను ముందుగానే ఎలా రీడీమ్‌ చేశారో పోలీసులకు వివరించారు. ఈ హ్యాకింగ్‌ కారణంగా తమకు ఎలా నష్టం జరిగిందో పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిని సైబర్‌ ఎటాక్‌గా అనుమానిస్తున్నట్లు ఫిర్యాదులో తెలిపారు. రివార్డు360 డైరెక్టర్‌ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎట్టకేలకు లక్ష్మీపతిని పట్టుకున్నారు. కేవలం బంగారం సహా ఇతర ఖరీదైన వస్తువులను మాత్రమే కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ప్రభుత్వ వెబ్‌సైట్లను టార్గెట్ చేయలేదని వెల్లడించారు. లక్ష్మీపతికి కోర్టులో హాజరుపరచగా కోర్టు జ్యూడిషియల్‌ రిమాండ్ విధించింది. నిందితుడు లక్ష్మీపతి ఏపీలోని చిత్తూరుకు చెందినవాడని తెలుస్తోంది. ఒంగోలులో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో బీటెక్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఓ సంస్థలో కొంతకాలం పనిచేసినట్లు తెలిపారు. ఈ సంవత్సరం జనవరి నుంచి జూన్‌ మధ్య కాలంలో రివార్డు360 వెబ్‌సైట్‌ను హ్యాక్‌చేసినట్లు గుర్తించారు. లక్ష్మీపతి నుంచి సుమారు రూ.3.4 కోట్లు విలువైన 5269 కిలోల 24 క్యారెట్ల బంగారం, 21.8 లక్షల విలువైన 27.2 కిలోల వెండి, 11.3 లక్షల డబ్బు, 12 లక్షల విలువైన 7 ద్విచక్రవాహనాలు, ఫ్లిప్‌కార్ట్‌ వాలెట్‌లో రూ.26 లక్షలు, అమెజాన్‌ వాలెట్‌లో రూ.3.5 లక్షలు, రూ. 1.3 లక్షల విలువైన 2 ల్యాప్‌టాప్‌లు, రూ.90,000 విలువైన 3 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Post a Comment

0 Comments

Close Menu