ఏఐ టూల్స్ ఆధారంగా వ్యక్తుల పాస్ వర్డ్ లు కాజేసే అవకాశం ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. అది కూడా ఏదో లింక్ లు పంపడమో, మేసేజ్ పంపడమో కాదు.. అసలు మన ప్రమేయం లేకుండానే ఎటువంటి లింక్ లు క్లిక్ చేయకుండానే.. కేవలం కంప్యూటర్, లేదా ల్యాప్ టాప్ కీబోర్డులో టైప్ చేయడం ద్వారా పాస్ వర్డ్ లను హ్యాక్ చేసేస్తారని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు యూనైటెడ్ కింగ్ డమ్ కు చెందిన కొందరు కంప్యూటర్ శాస్త్రవేత్తలు ఓ ఏఐ టూల్ ను గుర్తించారు. కార్నెల్ యూనివర్సిటీ లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం.. మీరు ఫోన్ మాట్లాడుతున్నప్పుడో లేదా జూమ్ కాల్లో ఉన్నప్పుడో బ్యాలెన్స్ చెక్ చేద్దామని పాస్ వర్డ్ ఎంటర్ చేశారనుకోండి ఈ ఏఐ టూల్ ఆ పాస్ వర్డ్ ను ట్రాక్ చేస్తుంది. కేవలం కీబోర్డులోని కీస్ చేసే శబ్దాలను బట్టి నేరగాళ్లు మీ పాస్ వర్డ్ ను ట్రాక్ చేస్తారు. మీ ఖాతాను కొల్లగొట్టేస్తారు. దీనిని అకౌస్టిక్ సైడ్ చానల్ అటాక్ అని పిలుస్తున్నారు. అకౌస్టిక్ సైడ్ చానల్ అటాక్ అంటే.. మీరు కీబోర్డులో టైప్ చేస్తున్నప్పుడు శబ్దాలను విశ్లేషించడం. దీని ద్వారా హ్యాకర్లు మీరు టైప్ చేస్తున్న కచ్చితమైన అక్షరాలు, సంఖ్యలను పసిగట్టగలుతారని నిపుణులు చెబుతున్నారు. దుర్హామ్, సర్రే,రాయల్ హోల్లోవే యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. దీనిలో వీరు మ్యాక్ బుక్ ప్రో, ఐఫోన్ 13 మినీని వాడారు. కీ బోర్డులోని 36 కీలను ప్రతి కీని 25 సార్లు ప్రెస్ చేశారు. ఏఐ మోడల్ ను గందరగోళ పరచడానికి ప్రెజర్ ఎక్కువ చేయడం, తక్కువ చేయడం వంటి చేస్తూ ఫింగర్లను మారుస్తూ కీలు ప్రెస్ చేశారు. అయిప్పటికీ ఏఐ ప్రోగ్రామ్ దానిని కచ్చితంగా గుర్తించగలిగిందని పరిశోధకులు గుర్తించారు. మీరు ఫోన్ మాట్లాడుతున్నారనుకోండి.. ఆ సమయంలో అకౌంట్ ఓపెన్ చేయాల్సి వచ్చింది. ఫోన్ మాట్లాడుతూనే మీరు ల్యాప్ టాప్ లో యూజర్ ఐడీ, పాస్ వర్డ్ ఎంటర్ చేశారనుకోండి. ఫోన్లో ఉండే మైక్రోఫోన్ ఆధారంగా ఈ ఏఐ టూల్ మీరు కీ బోర్డులో ఎంటర్ చేసిన అంకెలు, అక్షరాలను అంచనా వేస్తుంది. అది దాదాపు 95శాతం వరకూ కచ్చితత్వంతో ఉంటుందని నిపుణుల బృందం నిర్ధారించింది. అదే సమయంలో ల్యాప్ టాప్ లో జూమ్ కాన్ఫరెన్స్ లో ఉండి మీరు పాస్ వర్డ్ లు ఎంటర్ చేస్తే.. ఈ ఏఐ టూల్ దాదాపు 93శాతం అక్యూరసీతో పాస్ వర్డ్ ను ట్రాక్ చేస్తుందని వివరించింది. బహిరంగ ప్రదేశాల్లో ల్యాప్ టాప్ లు వినియోగించేవారు దీని బారిన పడే అవకాశాలు ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. అయితే దీని బారి నుంచి బయటపడేందుకు కూడా నిపుణులు కొన్ని సలహాలు ఇస్తున్నారు. మీరు కీ బోర్డు టైప్ చేసే సమయంలో మిక్స్ డ్ కీలను ప్రెస్ చేయాలి. క్యాపిటల్, స్మాల్ లెటర్స్ కలబోతగా ఉండేలా పాస్ వర్డ్ లను ఉంచుకోవాలి. షిఫ్ట్ కీ ఎక్కువగా వాడుతూ ఉంటే ఏఐ టూల్ పసిగట్టడం కష్టమవుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
0 Comments