Ad Code

హోన్ హై ఫాక్స్కాన్ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం


ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన హోన్ హై ఫాక్స్కాన్ సంస్థ చైర్మన్ యంగ్ ల్యూ  నేతృత్వంలోని ప్రతినిధి బృందం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో ప్రగతి భవన్ లో సమావేశమైంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు హోన్ హై ఫాక్స్కాన్ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా హోన్ హై ఫాక్స్కాన్  సంస్థ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల పరిశ్రమను నెలకొల్పేందుకు మార్గం సుగమమైంది.  దాంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి. ఎలక్ట్రానిక్స్ రంగంలో దేశంలోకి వచ్చిన అతి పెద్ద పెట్టుబడుల్లో ఇది ముఖ్యమైనది. యంగ్ ల్యూ' పుట్టిన రోజు కూడా ఇదే రోజుకూడా కావడంతో స్వదస్తూరితో ప్రత్యేకంగా తయారు చేయించిన గ్రీటింగ్ కార్డును సీఎం కేసీఆర్ స్వయంగా యాంగ్ లీకి అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.  అంతర్జాతీయంగా అనేక దేశాల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగ ముఖ చిత్రాన్ని గుణాత్మకంగా మార్చిన గొప్ప సంస్థ హోన్ హై ఫాక్స్కాన్  తమ ఉత్పత్తి కార్యకలాపాలకు తెలంగాణ రాష్ట్రాన్ని గమ్యస్థానం గా ఎంచుకోవడం పట్ల ఆ సంస్థకు సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఫాక్స్ కాన్ సంస్థ భవిష్యత్తు విస్తరణ ప్రణాళికల పైన కూలంకషంగా చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలో ఫాక్స్ కాన్ సంస్థ కార్యకలాపాలకు అన్ని రకాల సహాయ సహకారాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని సిఎం కేసీఆర్ ఈ సందర్భంగా చైర్మన్ యంగ్ ల్యూ కి హామీ ఇచ్చారు. తెలంగాణ స్వరాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించి భారీగా పెట్టుబడును రప్పించడంలో తమ ప్రభుత్వం విజయవంతమైందని సిఎం అన్నారు. రాష్ట్రంలో ఫాక్స్ కాన్ ' భారీ పెట్టుబడి పెట్టడంతోపాటు గతంలో లేని విధంగా లక్ష కు పైగా ఉద్యోగాల కల్పనకు అవకాశం రావడం గొప్ప విషయం అన్నారు. ఈ లక్ష ఉద్యోగాలను సాధ్యమైనంతవరకు స్థానిక తెలంగాణ యువతకు దక్కేలా చర్యలు చేపడుతామని ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం గురించి తమ సంస్థ విస్తృతంగా అధ్యయనం చేసిందన్నారు. ఇక్కడి పారిశ్రామిక అనుకూల వాతావరణం పైన ఫాక్స్ కాన్ చైర్మన్ ప్రశంసలు కురిపించారు. ఎనిమిది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం, పారిశ్రామిక రంగంలో, ముఖ్యంగా ఐటి, అనుబంధ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో సాధించిన అభివృద్ధి పైన ఆయన హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తమ సంస్థ పెట్టుబడుల విషయంలో ఆశావాహ దృక్పథంతో ఉన్నామన్నారు.

Post a Comment

0 Comments

Close Menu