అమెజాన్ భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. లేఆఫ్స్‌లో భాగంగా దాదాపు 18 వేల ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభమైనట్లు సమాచారం. తాజాగా అమెజాన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్ అనిశ్చిత పరిస్థితులకు అనుగుణంగా నిర్వహణ ఖర్చులను తగ్గించుకునేందుకు వివిధ దేశాల్లో ఆఫీస్‌లను విక్రయిస్తోంది. ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ అమెరికాలోని కాలిఫోర్నియాలో 2021లో ఓ ఆఫీస్‌ను భవిష్యత్ అవసరాల కోసం 123 అమెరికన్ మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. అయితే ప్రస్తుత ఆర్థిక అనిశ్చితి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దాన్ని విక్రయిస్తోందని బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ తెలిపింది. ఇప్పటికే ఓ కమర్షియల్ రియల్ ఎస్టేట్ డెవలపర్ కంపెనీతో చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే, అమెజాన్ ఈ ఆఫీస్‌ను నష్టానికి విక్రయించడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. కాగా, ధర ఇంకా ఫైనల్ కాలేదని బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ తెలిపింది. అమెజాన్ ప్రతినిధి స్టీవ్ కెల్లీ మాట్లాడుతూ తమ బిజినెస్ అవసరాలకు అనుగుణంగా నెట్‌వర్క్‌ను ఎప్పటికప్పుడు ఎవాల్యుయేషన్ చేస్తుంటామని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక మాంద్యం పరిస్థితుల ప్రభావంతో ఖర్చులను తగ్గించుకునేందుకు మెట్రో కార్పొరేట్ సెంటర్ సైట్‌ను విక్రయించాలని కంపెనీ నిర్ణయం తీసుకుందన్నారు. దీంతో మిల్పిటాస్‌లోని మరో రెండు డెలివరీ స్టేషన్స్ నుంచి కస్టమర్‌లకు ప్రొడక్ట్స్‌ను డెలివరీని కొనసాగిస్తామని కెల్లీ స్పష్టం చేశారు. తాజాగా 2,300 మంది ఉద్యోగులకు వార్నింగ్ నోటీస్ జారీ చేసింది. అయితే ప్రభావం ముందుగా యూఎస్, కెనడా, కోస్టారికాలోని ఉద్యోగులపై పడనుంది. తాజా నోటీస్ ప్రకారం.. సియాటెల్‌లో 1,852 మంది ఉద్యోగులను, బెల్లేవ్, వాషింగ్టన్‌లో 448 మందిని ఉద్యోగులను ముందుగా తొలగించనున్నారు. అయితే ఈ లేఆఫ్స్ మార్చిలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇండియాలోనూ అమెజాన్ లేఆఫ్స్‌కు తెరలేపింది. అనేక మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతోంది. భారతీయ నిపుణుల కోసం డిజైన్ చేసిన కమ్యూనిటీ యాప్ గ్రేప్‌విన్‌లో అమెజాన్ ఇండియా ఉద్యోగి ఒకరు ఓ పోస్ట్ చేశారు. తన టీమ్‌లో ఇప్పటికే 75 శాతం మందిని తొలగించారని పేర్కొన్నారు. దీంతో మిగిలిన 25 శాతం సభ్యుల్లో ఆందోళన మొదలైందని, ఎప్పుడు ఉద్యోగం పోతుందన్న టెన్షన్ భరించలేకపోతున్నామని, దీంతో వర్క్‌పై ఫోకస్ చేయలేకపోతున్నట్లు అతడు చెప్పుకొచ్చాడు.
0 Comments