మామూలు వాచ్‌లు వాడేవారంతా ఇప్పుడు స్మార్ట్ వాచ్‌లు వాడేందుకు మక్కువ చూపుతున్నారు. దీంతో స్మార్ట్‌వాచ్‌లకు ఇండియా నెంబర్ వన్ మార్కెట్‌గా మారిందని ఇండస్ట్రీ రిపోర్ట్స్ చెబుతున్నాయి. కౌంటర్ పాయింట్ సంస్థ నిర్వహించిన రీసెర్చ్‌లో ఈ విషయంపై ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. 2022 మూడో క్వార్టర్‌లో భారత స్మార్ట్ వాచ్‌ల మార్కెట్ 171 శాతం వృద్ధి చెందింది. గ్లోబల్ స్మార్ట్‌వాచ్ మార్కెట్ నుంచి షిప్‌మెంట్లు గత ఏడాది థర్డ్ క్వార్టర్‌తో పోలిస్తే ఈ మూడో త్రైమాసికంలో 30 శాతం పెరిగాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచీ ద్రవ్యోల్బణం, రాజకీయ సంక్షోభాలు కొనసాగుతూనే ఉన్నా ఇప్పుడు మన దేశం అతి పెద్ద స్మార్ట్ వాచ్‌ల మార్కెట్‌గా అవతరించిందని సంస్థ తెలిపింది. 2020 నాలుగో త్రైమాసికం నుంచి 2022 రెండో త్రైమాసికం వరకు 21 శాతం వృద్ధితో ఉత్తర అమెరికా వీటికి అతి పెద్ద మార్కెట్‌గా ఉంది. అయితే భారత్‌లో వచ్చిన ఈ బూమ్‌తో ఇప్పుడు అది రెండో స్థానానికి పడిపోయింది. ఈ విషయమై సీనియర్ అనలిస్ట్ అన్షికా జైన్ మాట్లాడుతూ భారతదేశ స్మార్ట్‌వాచ్ మార్కెట్ మూడో త్రైమాసికంలో అత్యంత వేగంగా వృద్ధి చెంది అతి పెద్ద మార్కెట్‌గా అవతరించిందని తెలిపారు. మూడో త్రైమాసికంలో పండగ సీజన్ కావడంతో ఈ వృద్ధి సాధ్యమైందన్నారు. భారతీయ బ్రాండ్లు స్థానిక తయారీకి ప్రాధాన్యం ఇచ్చి, సరసమైన ధరలకు తమ ప్రొడక్టులను తయారు చేస్తున్నాయని, అది ఈ మార్కెట్ వృద్ధికి దోహదపడిందన్నారు. మరో రీసెర్చ్ అనలిస్ట్ వూజిన్ సన్ మాట్లాడుతూ స్మార్ట్‌వాచ్‌ల రకాల్లో.. బేసిక్ స్మార్ట్‌వాచ్లు, ఆపరేటింగ్ సిస్టంతో పని చేసే లైటర్ వెర్షన్లు ఇప్పుడు అందుబాటు ధరల్లో లభిస్తున్నాయన్నారు. దీంతో గ్లోబల్ మార్కెట్ వీటి వైపునకు మారుతోందని తెలిపారు. నాయిస్ అమ్మకాలు ఈ ఏడాది మూడో త్రైమాసికంలో ఏకంగా 218 శాతం వృద్ధిని సాధించాయి. దీంతో భారత మార్కెట్‌లో ఈ సంస్థ అమ్మకాలలో అగ్ర స్థానానికి చేరింది. ఆ తర్వాత స్థానంలో ఫైర్ బోల్ట్ వాచ్‌లు ఉన్నాయి. కొత్తగా విడుదల చేసిన ఆపిల్ వాచ్ 8 సిరీస్ అమ్మకాలు జోరుగా సాగాయి. గతేడాది మూడో త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది మూడో త్రైమాసికంలో ఆపిల్ వాచ్‌ల అమ్మకాలు 48 శాతం పెరిగాయి. శామ్ సంగ్ గెలాక్సీ వాచ్ 5 సిరీస్‌ను విడుదల చేయడంతో వీటి అమ్మకాలు బాగానే జరిగాయి. గతేడాది ఈ సమయంతో పోలిస్తే ఈ ఏడాది మూడో త్రైమాసికంలో శామ్ సంగ్ షిప్మెంట్లు 62 శాతం మేర పెరిగాయి.
0 Comments