భారత రక్షణ శాఖ ఇటీవల 'అగ్ని-5 క్షిపణి'ని పరీక్షించిన సంగతి తెలిసిందే. దాదాపు దశాబ్దం క్రితం నుంచి ప్రయోగిస్తున్న ఈ క్షిపణి, గతంలోకంటే మెరుగ్గా తయారైందని రక్షణశాఖ అధికారులు వెల్లడించారు. ఈ క్షిపణిని అభివృద్ధి చేసిన డీఆర్‌డీవో అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 'అగ్ని-5 క్షిపణి' 7,000 కిలోమీటర్ల సామర్ధ్యం కలిగి ఉంది. ఇది అణ్వాయుధాల్ని మోసుకెళ్లగలదు. గతంలోకంటే దీని బరువును శాస్త్రవేత్తలు తాజాగా 20 శాతం తగ్గించారు. గతంలో ఈ క్షిపణిని ఎక్కువగా స్టీల్‌తో తయారు చేసే వాళ్లు. అయితే, ఇప్పుడు స్టీల్ బదులుగా పలు కాంపోజిట్ మెటీరియల్స్ వాడటం వల్ల దీని బరువు తగ్గింది. అయితే, వీటిని పూర్తి స్థాయిలో ప్రయోగించాలన్నా, వాటిని అభివృద్ధి చేయాలన్నా ప్రభుత్వ అనుమతి కావాలి. మన దేశం అభివృద్ధి చేసిన అత్యంత ప్రమాదకర, శక్తివంతమైన క్షిపణి ఇది. చైనాలోని అనేక ప్రాంతాలను ఈ క్షిపణి చేరుకోగలదు. చైనా రాజధాని బీజింగ్ కూడా ఈ క్షిపణి పరిధిలోకి వస్తుంది. ఇంతకుముందు ఉన్న అగ్ని క్షిపణులతో పోలిస్తే దీని నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువ. దీన్ని ప్రయోగించడం కూడా చాలా సులువు. 'అగ్ని-5 క్షిపణి' చైనా క్షిపణులకు గట్టి పోటీనే ఇవ్వగలవు. చైనా రూపొందించిన డాంగ్ ఫెంగ్-41 అనే క్షిపణి 12,000-15,000 కిలోమీటర్ల సామర్ధ్యం కలిగి ఉంది. ఈ క్షిపణి ఇండియాలోని ఏ సిటీనైనా చేరగలదు. ఇండియాకు చైనా, పాకిస్తాన్ నుంచి నిత్యం ప్రమాదం పొంచి ఉన్న దృష్ట్యా మన రక్షణ వ్యవస్థని మెరుగుపర్చుకోవడం అత్యవసరం. అందువల్ల ఇండియా నిరంతరం క్షిపణుల్ని అభివృద్ధి చేస్తోంది. దీనిలో భాగంగా సబ్‌మెరైన్ లాంచ్‌డ్ బాలిస్టిక్ మిస్సైల్స్ తయారు చేస్తోంది. అంటే సబ్‌మెరైన్ నుంచి కూడా ప్రయోగించగలిగే క్షిపణుల్ని ఇండియా డెవలప్ చేస్తోంది. మనకు పోటీగా ఉన్న దేశాలతో సమానంగా ఆయుధాల్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, ఇండియా ఒక విధానాన్ని అనుసరిస్తోంది. 'నో ఫస్ట్ యూజ్ పాలసీ'ని ఫాలో అవుతోంది. అంటే మొదట ఆయుధాల్ని మనం వాడకూడదనేది మన నిబంధన.
0 Comments