గుర్తుతెలియని నెంబర్ నుంచి కాల్ వచ్చినా, ఎవరు చేశారో తెలుసుకునే వెసులుబాటును టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కల్పించబోతుంది. కాల్ స్వీకరించినప్పుడు కాలర్ పేరు డిస్‌ప్లే మీద కనిపించేలా సరికొత్త మార్పులు తీసుకురానుంది. గుర్తుతెలియని కాల్స్ మూలంగా చాలామంది వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని ట్రాయ్ దృష్టికి వచ్చింది. అంతేకాదు, గుర్తు తెలియని వ్యక్తులు ఫేక్ నెంబర్స్ ద్వారా పలువురిని బెదిరించినట్లు గుర్తించారు. ఇకపై ఎవరు, ఎవరికి కాల్ చేసినా, వారికి పేరు కనిపించేలా చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించింది. టెలికాం ఆపరేటర్ల దగ్గర అందుబాటులో ఉన్న వినియోగదారుల కస్టమర్ రికార్డ్‌ను బట్టి కాల్ చేసిన వారి పేరు డిస్ ప్లే అవుతుందని వెల్లడించింది. ట్రాయ్ తీసుకునే ఈ నిర్ణయం మూలంగా తమ కాంటాక్ట్ లిస్టులో కాలర్ నెంబర్ లేకపోయినా, ఫోన్ చేసిన వారు ఎవరనేది ఈజీగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వినియోగదారులు తెలియని కాలర్ గుర్తింపును కనుగొనేందుకు ట్రూ కాలర్ లాంటి థర్డ్ పార్టీ యాప్ లను ఉపయోగించుకుంటున్నారు. డేటా క్రౌడ్ సోర్స్ గా ఉన్నందున Truecaller లాంటి యాప్ లకు చాలా వరకు పరిమితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కచ్చితమైన ప్రామాణికత ఉండదు. కానీ, ట్రాయ్ తీసుకునే కేవైసీ డేటా ఆధారంగా డిస్ ప్లే అయ్యే పేరు వందకు వంద శాతం కచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే.. ఈ KYC డేటా, సర్వీస్ ప్రొవైడర్లు అధికారికంగా ఇస్తారు. ఇందులో ఎలాంటి తప్పుడు సమాచారానికి అవకాశం ఉండదు. దీని కారణంగా కాలర్ కు సంబందించి కచ్చితమైన గుర్తింపు ఉంటుంది. ఈ చర్యల మూలంగా స్పామ్ కాల్స్ ను నివారించే అవకాశం ఉంటుంది. థ్రెటెనింగ్ కాల్స్ నుంచి రక్షణ పొందే వెసులుబాటు ఉంటుంది. త్వరలో ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.
0 Comments