ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా 11,000 మంది ఉద్యోగులను మెటా తొలగించింది. మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించిన ఈ భారీ తొలగింపులలో రెండు, మూడు రోజుల కింద జాయిన్ అయిన వారితో పాటు సెలవుల్లో ఉన్నవారు కూడా ప్రభావితమయ్యారు. వారిలో అన్నెకా పటేల్ అనే మహిళ కూడా ఉన్నారు. ఫేస్‌బుక్‌లో కమ్యూనికేషన్స్ మేనేజర్‌గా పనిచేసిన అన్నెకా, ప్రసూతి సెలవులో ఉన్న సమయంలోనే ఈ బ్యాడ్ న్యూస్ అందుకున్నారు. మెటా బుధవారం లేఆఫ్ ప్రక్రియ చేపట్టిన తర్వాత ఫేస్‌బుక్ మాజీ కమ్యూనికేషన్ మేనేజర్ అన్నెకాకి ఈమెయిల్ వచ్చింది. ఆ మెయిల్ ద్వారా తన ఉద్యోగం పోయినట్లు తెలుసుకున్న తరువాత మానసికంగా కుంగిపోయినట్లు ఆమె చెప్పుకొచ్చారు. 3 నెలల పాప ఎమిలియాకు తల్లి అయిన అన్నెకా ఈ తొలగింపు తనని ఎంతగా కలిసివేసిందో ఒక లింక్డ్‌ఇన్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. 'మెటా లేఆఫ్‌ల వల్ల ప్రభావితమైన 11,000 మంది ఉద్యోగులలో నేను ఒకరినని ఈ ఉదయం తెలుసుకున్నాను. నేను ప్రస్తుతం మెటర్నటీ లీవ్‌లో ఉన్నందున ఇది నన్ను తీవ్రంగా కలచివేసింది. ఈ-మెయిల్ అందుకోగానే గుండె పగిలిపోయింది. ఫేస్‌బుక్ గ్రూప్స్ ప్రొడక్ట్‌పై 2.5 ఏళ్లుగా పని చేశాను. ఇది ఫేస్‌బుక్‌లో అత్యుత్తమ భాగం అని నేను నిజంగా భావిస్తున్నాను.' అని ఆమె అన్నారు. ఈ కాలం పాటైనా తనకు ఫేస్‌బుక్‌లో పనిచేసే అవకాశాన్ని ఇచ్చినందుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తన పోస్ట్‌లో తన మెటర్నటీ లీవ్ ఫిబ్రవరిలో ముగుస్తుందని అన్నేకా వెల్లడించారు. లింక్డ్‌ఇన్ పోస్ట్ ప్రకారం, ఆమె వచ్చే ఏడాది నుంచి వర్క్ చేయడం మొదలు పెడతారు. కొత్త జాబ్‌లో జాయిన్ కావడానికి ముందు కొద్ది నెలల సమయాన్ని తన కుమార్తె కోసం కేటాయిస్తానని చెప్పారు. కొత్త సంవత్సరంలో ఏదైనా కంపెనీలో కమ్యూనికేషన్స్ రోల్ తనకు పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుందని ఎవరైనా అనుకుంటే తనను రిఫర్ చేయాలని కోరుతూ ఆమె తన పోస్ట్ ముగించారు.
0 Comments