Ad Code

వచ్చే వారం నుంచి ఐ ఫోన్‌లలో 5జీ సేవలు ?


ఆపిల్ తన ఐఓఎస్ 16 బీటా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను అందుబాటులోకి తేనుంది. 5జీ నెట్ వర్క్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌లను వచ్చే వారం నుంచి విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఐఫోన్ 14, ఐఫోన్ 13, ఐఫోన్ 12. ఐఫోన్ ఎస్ఈ ( థర్డ్ జనరేషన్) మోడళ్లలో 5జీ సేవలను పొందవచ్చు. ఎయిర్ టెల్, రిలయన్స్ జియో కస్టమర్లు ఈ ఫోన్లలో బీటా సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌ ను ఉపయోగించి 5 జీ సేవలను పొందవచ్చని కంపెనీ వెల్లడించింది. ఈ సాఫ్ట్‌వేర్ పై వినియోగదారులు తమ ఫీడ్ బ్యాక్ అందిచాలని సంస్థ కోరుతోంది. దీని వల్ల సమస్యలను, సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్ ను మరింతగా మెరుగుపరిచే అవకాశం ఏర్పడనుంది. ఐఫోన్ వినియోగదారులు ప్రోగ్రామ్, సాఫ్ట్‌వేర్ రెండింటిని ఉచితంగా పొందవచ్చని ఆపిల్ చెప్పింది. సరైన ఆపిల్ ఐడీ కలిగిన వారు బీటా సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్ ను సైన్ అప్ ప్రాసెస్ ద్వారా ఓపెన్ చేయొచ్చని తెలిపింది. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా 5జీ ప్రారంభించబడుతుందని.. డిసెంబర్‌లో ఐఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని ఆపిల్ ఒక ప్రకటనలో తెలిపింది. అక్టోబర్ 1న ఢిల్లీలో జరిగిన 6వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ 5 జీ సేవలను ప్రారంభించారు. ప్రస్తుతం ఎయిర్ టెల్ ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, సిలిగురి, నాగ్‌పూర్, వారణాసి నగరాల్లో సేవలను ప్రారంభించింది. 2023 నాటికి దేశం మొత్తం 5 జీ సేవలను అందిస్తామని వెల్లడించింది. మరోవైపు జియో ఢిల్లీ ,ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో తన సేవలను ప్రారంభించింది. 2023 నాటికి దేశంలోని అన్ని ప్రాంతాలకు తమ సేవలను విస్తరిస్తామని వెల్లడించింది. 

Post a Comment

0 Comments

Close Menu