ఫేస్‌బుక్‌లో ఫాలోవర్ల సంఖ్య అనూహ్యంగా తగ్గుతోంది. ఉన్నట్టుండి తమ ఖాతా ఫాలోవర్ల సంఖ్య అమాంతం పడిపోయిందంటూ పలువురు యూజర్లు సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మెటా కంపెనీ వ్యవస్థాపకుడు, ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఖాతాకు కూడా ఇదే పరిస్థితి ఎదురవ్వడం గమనార్హం. జుకర్‌బర్గ్ అధికారిక ఖాతకు గతంలో 119 మిలియన్ల అనగా 11.9కోట్లకు పైగా ఫాలోవర్లు ఉండగా ఇప్పుడా సంఖ్య 10 వేల కంటే తక్కువకు పడిపోయింది. ప్రస్తుతం మార్క్ జుకర్ బర్గ్ ఖాతాను 9,995 మంది ఫాలో అవుతున్నారు. ఇకపోతే అటు బంగ్లాదేశ్ రచయిత తస్లీమా నస్రీన్ కూడా దీనిపై స్పందించారు. తన ఖాతాను ఇదివరకు 9 లక్షల మందికి పైగా అనుసరించగా ఇప్పుడు కేవలం 9 వేల మంది మాత్రమే ఫాలోవర్లు ఉన్నారని ఆమె ట్విట్టర్ వేదికగా తెలిపారు. దీనిపై మెటా అధికారిక ప్రతినిధి స్పందిస్తూ ''కొంతమంది ఫేస్‌బుక్ ప్రొఫైళ్లలో అనూహ్యంగా ఫాలోవర్లు తగ్గడం తమ దృష్టికి వచ్చిందని. ఈ అసౌకర్యానికి గాను యూజర్లకు క్షమాపణలు తెలియజేస్తున్నాం. వీలైనంత త్వరగా పరిస్థితులను చక్కపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాం'' అని తెలిపారు. కాగా ఫాలోవర్ల సంఖ్య ఎందుకు తగ్గిందన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇకపోతే ఈ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే జుకర్‌బర్గ్ మరియు తస్లీమా నస్రీన్ ఫాలోవర్ల సంఖ్య ఎప్పటిలాగానే సాధారణ స్థితికి చేరుకుంది.
0 Comments