ఏటీఎం, రెస్టారెంట్, షాపింగ్ మాల్... ఇలా ఏం కావాలన్నా గూగుల్ మ్యాప్స్‌లో వెతుకుతుంటారు. పబ్లిక్ టాయిలెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా గూగుల్ మ్యాప్స్‌లో తెలుసుకోవచ్చు. ఇలా రకరకాల సర్వీసులు అందిస్తూ గూగుల్ మ్యాప్స్ ప్రతీ ఒక్కరికీ ఓ అవసరంగా మారిపోయింది. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ మరో అద్భుతమైన ఫీచర్ తీసుకొస్తోంది. ఈ ఫీచర్ వాడుకోవడం ద్వారా వాహనదారులు తమ పెట్రోల్, డీజిల్ ఖర్చుల్ని తగ్గించుకోవచ్చు. గూగుల్ మ్యాప్స్‌లో మీ కార్ ఇంజిన్‌ను బట్టి రూట్ ఎంచుకోవచ్చు. ఇందుకు సంబంధించిన గుర్తులు గూగుల్ మ్యాప్స్‌లో కనిపిస్తాయి. ఆ గుర్తుల్ని బట్టి రూట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. పెట్రోల్, డీజిల్, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ కార్లకు వేర్వేరు గుర్తులు ఉంటాయి. దీన్ని బట్టి రూట్ కూడా మారుతుంది. పెట్రోల్ కార్లకు ఒక రూట్, డీజిల్ కార్లకు మరో రూట్, ఇలా వేర్వేరు ఇంజిన్లు ఉన్న కార్లకు వేర్వేరు రూట్స్ చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్. ఇలా గూగుల్ మ్యాప్స్ చూపించే రూట్‌లో వెళ్తే సాధారణంగా ఖర్చయ్యే ఫ్యూయెల్ కన్నా తక్కువ ఫ్యూయెల్ ఖర్చవుతుంది. గూగుల్ మ్యాప్స్‌లో ఇప్పటికే కారు, టూవీలర్, కాలినడకకు వేర్వేరు రూట్స్ చూపిస్తుంటాయి. కొత్త ఫీచర్‌తో పెట్రోల్, డీజిల్, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాలు ఎంచుకునే ఆప్షన్ రాబోతోంది. ఈ ఫీచర్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. పెట్రోల్, డీజిల్ ధరలు భారం అవుతున్న వాహనదారులకు ఈ ఫీచర్ ఎంతో కొంత మేలు చేయనుంది. డ్రైవింగ్ స్టైల్, రోడ్డు పరిస్థితులు, ఒక ప్రాంతంలోని ట్రాఫిక్ సాంద్రతను బట్టి ఇంధన సామర్థ్యం ఉంటుందని చెబుతుంటారు నిపుణులు. అందుకు తగ్గట్టుగా గూగుల్ ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తుంది. ఈ ఆల్టర్నేటీవ్ రూట్స్ ఎంచుకోవడం ద్వారా తక్కువ ఫ్యూయెల్‌తోనే డెస్టినేషన్ చేరుకునే వీలుంటుంది. కొన్ని దేశాల్లో, గూగుల్ మ్యాప్స్ ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ బైక్‌ల కోసం ఛార్జింగ్ స్టేషన్ల వివరాలను అందిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల డ్రైవింగ్ రేంజ్‌కు సంబంధించి గూగుల్ దగ్గర ఇప్పటికే డేటా ఉంది. అయితే కొత్తగా రూపొందించిన ఫీచర్ పూర్తి స్థాయిలో ఎలా ఉంటుంది, వాహనదారులకు ఏమేరకు ఉపయోగపడుతుందన్నది తెలియాల్సి ఉంది.
0 Comments