కాలుష్యం ప్రస్తుతం యావత్ మానవాళి ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యగా మారింది. అందులోనూ శాస్త్రవేత్తలకు పెద్ద సవాల్‌గా మారిన విషయం ప్లాస్టిక్. దీనిని భూమిలో పూడిస్తే అది మట్టిలో కలిసిపోయేందుకు కొన్ని దశాబ్దాలు పడుతుంది. లేదు కాల్చేద్దాం అనుకుంటే వాటి నుంచి విషపూరిత వాయువు వెలువడుతుంది. దీంతో భూమిపై ప్లాస్టిక్ వ్యర్థాలు భారీగా పెరిగిపోయాయి. అయితే తాజాగా ఈ సమస్యకు చెక్ చెప్తూ ఓ సంస్థ సరికొత్త ఎంజైమ్‌ను తయారు చేసింది. ఈ ఎంజైమ్‌ను వినియోగించిన కొన్ని గంటల్లోనే ప్లాస్టిక్ తన ప్రాథమిక మాలిక్యులర్ స్థాయికి చేరుకుంటుంది. తద్వారా దాంతో సరికొత్త వస్తువులను తయారు చేయొచ్చు. దీనికి శాస్త్రవేత్తలు FAST-PETase గా నామకరణం చేశారు. ఇందులో FAST అంటే ఫంక్షనల్, యాక్టివ్, స్టేబుల్, టాలరెంట్ అని అర్థం. అంతే కాకుండా ఈ ఎంజైం సాధారణ వాతావరణంలోనే ప్లాస్టిక్‌కు విచ్ఛిన్నం చేస్తోంది. ప్లాస్టిక్‌కు విచ్చిన్నం చేసేందుకు కావాలసిన బ్యాక్టీరియాను ఇది ఉత్తేజితం చేస్తోందని వారు తెలిపారు. దీనిపై నిపుణులు మాట్లాడుతూ.. ఇది ప్రస్తుతం సమాజంలో ఓ సరికొత్త విప్లవం తెస్తోందని, భూమిపై ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడంలో ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నారు. దాంతో పాటుగా దీని కారణంగా దుష్పరిణామాలు ఏమైనా ఉంటాయా లేదా అన్న దానిపై మరింత పరిశోధన చేయాలని, దీనికి సంబంధించిన పూర్తి సమాచారన్ని అందరికీ అందుబాటులో ఉంచాలని వారు కోరుతున్నారు.
0 Comments