ఆన్ లైన్ లో బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసేందుకు చాలా మంది గూగుల్ పే, ఫోన్ పే లను వాడుతుంటారు. మిగతా యాప్ లు కూడా ఉన్నా ఇవి రెండూ అగ్ర స్థానంలో ఉన్నాయి. పేటీఎం, అమెజాన్ పే కూడా ఈ బాటలోనే ఉన్నాయి. అయితే అగ్ర స్థానాన్ని త్వరలో వాట్సప్ అందుకోబోతోందని చెబుతున్నారు. దేశంలో రోజు రోజుకీ యూపీఐ లావాదేవీలు భారీగా పెరుగుతున్నాయి. చాలా మంది యూపీఐ సేవలని వినియోగించుకుంటున్నారు. కొవిడ్ తర్వాత డిజిటల్ పేమెంట్స్ చేసే వారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా బాగా పెరిగింది. అయితే ఈ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉన్న వాట్సప్ మాత్రం కాస్త వెనకబడి ఉందనే చెప్పాలి. అందరి చేతిలో స్మార్ట్ ఫోన్, అందరి ఫోన్లలో వాట్సప్. కానీ డిజిటల్ పేమెంట్స్ దగ్గరికి వచ్చే సరికి అందరూ ఫోన్ పేనో, గూగుల్ పేనో తీస్తుంటారు. ఇకపై వాట్సప్ కూడా ఈ విషయంలో దూకుడుగా ఉండబోతోందని తెలుస్తోంది. ఇటీవలే 10 కోట్ల మంది వరకు పేమెంట్ సేవలను అందించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వాట్సప్ అనుమతి తీసుకుంది. ఇప్పటి వరకూ వాట్సప్ క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఇవ్వలేదు. ఇప్పుడిక కస్టమర్లకు క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఇస్తూ మరింత ఫేమస్ అయ్యేందుకు వాట్సప్ ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది జూన్ మొదటి వారానికి వాట్సప్ లో క్యాష్ బ్యాక్ సదుపాయం అందుబాటులోకి వస్తుందని సమాచారం. వాట్సప్ ద్వారా యూపీఏ పేమెంట్స్ మొదలు పెట్టేవారికి తొలినాళ్లలో ఒక్కో యూజర్ కి 33 రూపాయలు క్యాష్ బ్యాక్ ఇస్తారని తెలుస్తోంది. గతంలో గూగుల్ పే నుంచి అటు ఇటు డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసుకుంటే వెంటనే క్యాష్ బ్యాక్ వచ్చేది. అలా గూగుల్ పే కి అందర్నీ అట్రాక్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత ఫోన్ పే కూడా డిజిటల్ పేమెంట్స్ కి డిస్కౌంట్లు, కూపన్లు ఇచ్చి ఆకట్టుకుంది. ఇప్పుడు వాట్సప్ కూడా అదే బాటలో పయనించాలనుకుంటోంది. మొదటి మూడు లావాదేవీలకు 33 రూపాయలు క్యాష్ బ్యాక్ ఇస్తారు. ఈ అమౌంట్ తక్కువ అనుకున్నా కూడా అందరూ వాట్సప్ కి మారి ఆ క్యాష్ బ్యాక్ తీసుకుని ఆ తర్వాత తమకు ఇష్టమైన, తమకు కన్వీనియంట్ గా ఉండే పేమెంట్స్ వైపు వస్తారు. సో.. ఎలాగైనా వాట్సప్ కస్టమర్లను ఆకర్షించే అవకాశముంది. ఇలా వాట్సప్ విజృంభిస్తే మాత్రం మిగతా వాటికి కష్టకాలమేనని చెప్పాలి. ఇన్నాళ్లూ డిజిటల్ పేమెంట్స్ పై వాట్సప్ పెద్దగా దృష్టిసారించలేదు కాబట్టి సరిపోయింది. వాట్సప్ రంగంలోకి దిగితే మిగతా యాప్ లు కాస్త డౌన్ అయ్యే అవకాశముంది.
0 Comments