యాపిల్ సంస్థ ఇప్పటికే యాపిల్ మ్యూజిక్, యాపిల్ టీవీ+, ఐక్లౌడ్+ వంటి అనేక డిజిటల్ సబ్‌స్క్రిప్షన్ సేవలను యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా కొత్తగా హార్డ్‌వేర్ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ పరిచయం చేసేందుకు సిద్ధమవుతోందని ఓ లేటెస్ట్ నివేదిక వెల్లడించింది. బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్ ప్రకారం, యాపిల్ సంస్థ హార్డ్‌వేర్ సబ్‌స్క్రిప్షన్‌లలోకి అడుగుపెట్టాలని యోచిస్తోంది. ఆ నివేదిక ప్రకారం, యాపిల్ సంస్థ ప్రస్తుతం ఐఫోన్, ఇతర హార్డ్‌వేర్ ప్రొడక్ట్స్ కోసం ఓ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్‌పై పని చేస్తోంది. ఐఫోన్‌ను వాడాలనుకుంటే దాన్ని కొనుగోలు చేసే బదులు జస్ట్ సబ్‌స్క్రిప్షన్ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. ఐఫోన్‌ను ఒక నిర్దిష్ట సమయం వరకు లీజు లేదా రెంట్ లాగా తీసుకోవచ్చు. ఆ సమయం వరకు సబ్‌స్క్రిప్షన్ ఫీజు చెల్లించి తర్వాత ఐఫోన్‌ను రిటర్న్ చేస్తే సరిపోతుంది. ప్రస్తుతం యాపిల్ సబ్‌స్క్రిప్షన్ లాంటి ఐఫోన్ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్‌ను అందుబాటులో ఉంచింది. ఇది పాత ఐఫోన్ ఇచ్చి కొత్త ఐఫోన్ సొంతం చేసుకోవడానికి 12 నెలల వ్యవధిలో నెలనెలా కొంత డబ్బులు చెల్లించడానికి అనుమతిస్తుంది. అయితే ఈ ఇన్‌స్టాల్‌మెంట్ పద్ధతి వేరు, ఇప్పుడు యాపిల్ తీసుకురావాలని అనుకుంటున్న సర్వీస్ వేరు. ఈ సర్వీసులో ఐఫోన్ ధరను విభజించి నెలకి ఇంత కట్టాలి అని కాకుండా.. జస్ట్ సబ్‌స్క్రిప్షన్ ఫీజు మాత్రమే వసూలు చేస్తారు. అయితే యాపిల్ ఒక నెలకు సబ్‌స్క్రిప్షన్ ఫీజుని ఎంతగా నిర్ణయిస్తుందో తెలియాల్సి వుంది. యూజర్లు సెలెక్ట్ చేసుకునే మోడల్ ని బట్టి నెలవారీ ఫీజు నిర్ణయించవచ్చని తెలుస్తోంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, కొత్త సబ్‌స్క్రిప్షన్ మోడల్ అందుబాటులోకి వస్తే.. ఇది ఆటోమేటిక్‌గా రికరింగ్ సేల్స్ కి అతిపెద్ద పుష్ ఇస్తుంది. దీనివల్ల యాపిల్ బాగా లాభపడే అవకాశం ఉంది. అంతేకాదు యూజర్లు మొదటిసారి హార్డ్‌వేర్ ప్రొడక్ట్స్ కు సబ్‌స్క్రిప్షన్ పొందేలా చేస్తుంది.
0 Comments