Ad Code

కవచ్‌ టెక్నాలజీతో రైలు ప్రమాదాలకు చెక్?


పార్లమెంట్‌ లో ప్రవేశపెట్టిన 2022-2023 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రైల్వేకు పెద్ద పీట వేశారు. వచ్చే మూడేళ్లలో 400 వందే భారత్ రైళ్లను తయారు చేస్తామని ఆమె ప్రకటించారు. అంతేకాకుండా 100 పీఎం గతి శక్తి కార్గో టర్మినల్స్‌ను వచ్చే మూడేళ్లలో నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. దాదాపు 1.37 లక్షల కోట్లను ఆమె రైల్వేకు కేటాయించడం గొప్ప విషయమని రైల్వే మినిస్టర్‌ అశ్విని వైష్ణవ్ కొనియాడారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్న కవచ్ అందరి దృష్టినీ ఆకర్షించింది.  రైళ్ల ప్రమాదాలను నివారించడానికి తీసుకొచ్చిన యాంటీ కొలిజన్ డివైజ్ (ACD) నెట్‌వర్క్‌నే కవచ్‌గా పేర్కొంటారు. భవిష్యత్తులో దేశంలో జరిగే రైళ్ల ప్రమాదాలు జీరోగా ఉండాలనే లక్ష్యంతో కవచ్‌ను తీసుకొచ్చారు. రేడియో కమ్యూనికేషన్‌, మైక్రో ప్రాసెసర్స్‌, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (GPS)ల సమ్మేళనమే ACD. ఈ టెక్నాలజీని దేశీయంగా తయారు చేయడం విశేషం. ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు వ్యతిరేక దిశలో వస్తున్నప్పుడు ఈ కవచ్ టెక్నాలజీ అక్కరకు వస్తుంది. ఒకే ట్రాక్‌పై ఉన్న రెండు రైళ్ల లొకేషన్‌ను కచ్చితత్వంతో తెలుసుకోవచ్చు. ఒకవేళ రెండు రైళ్లు కూడా అతి సమీపంలోకి వస్తే అటోమెటిక్ బ్రేకింగ్ యాక్షన్ పని చేసి ప్రమాదాన్ని నివారిస్తుంది. ఈ కవచ్ పరిధిలోకి 2 వేల కిలోమీటర్ల నెట్‌వర్క్‌ను తీసుకురానున్నట్లు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. రైల్వేస్‌లో కవచ్ గొప్ప ఇనిషియేటివ్ అని రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఈ కవచ్ వల్ల ప్రమాదాలు పూర్తిగా తగ్గిపోతాయని ఆయన నమ్మకంగా చెప్పారు. వచ్చే 10 వేల సంవత్సరాల్లో కేవలం ఒక ప్రమాదం మాత్రమే జరిగే అవకాశం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇకపై రైల్ కోచ్‌లను ఉక్కుతో కాకుండా అల్యూమినియంతో తయారు చేయనున్నారు. ఇందుకు ఇంధన ఆదాయే ప్రధాన కారణం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వందే భారత్ మిషన్‌లో భాగంగా వచ్చే మూడేళ్లలో 400 న్యూ జనరేషన్ రైళ్లను తయారు చేయనున్నారు. అయితే వీటిని ఉక్కతో కాకుండా అల్యూమినియంతో తయారు చేస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీని వల్ల ఇంధన వినియోగం చాలా వరకు తగ్గుతుందని ఆమె పేర్కొన్నారు. 2023 ఆగస్టు 15 నాటికి ఈ రైళ్లను కనీసం 75 రూట్లలో ప్రయాణించేలా చేయాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. 100 పీఎం గతి శక్తి కార్గో టర్మినల్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు నిర్మల తన బడ్జెట్ స్పీచ్‌లో పేర్కొన్నారు. వీటితో పాటు 2022-23 ఆర్థిక సంవత్సరానికి మొత్తంగా 2.38 లక్షల కోట్లను రైల్వేలో ఖర్చు చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా నాలుగు ప్రదేశాల్లో మల్టీ మోడల్ పార్క్‌లను ఏర్పాటు చేయనున్నట్లు నిర్మల స్పష్టం చేశారు. స్థానిక వ్యాపారులకు, సరఫరాదారులకు సహాయం అందించేలా వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ కాన్సెప్ట్‌ను తీసుకొస్తున్నట్లు ఆమె తెలిపారు. రైల్వేతో పోస్టల్ డిపార్ట్‌మెంట్‌ను అనుసంధానం చేసి పార్సిళ్ల రవాణాలో సమస్యలు తలెత్తకుండా చూస్తామని ఆమె హామీ ఇచ్చారు.

Post a Comment

0 Comments

Close Menu