త్వరలో స్మార్ట్‌ఫోన్ల ధరలు తగ్గబోతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 బడ్జెట్‌లో వరాలు ప్రకటించారు. దీంతో స్మార్ట్‌ఫోన్ ధర తగ్గనుంది. స్మార్ట్‌ఫోన్లు మాత్రమే కాదు స్మార్ట్ వాచ్‌ల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. విడిభాగాలపై విధించే సుంకాల్లో రాయితీ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. మొబైల్ ఫోన్ ఛార్జర్ల ట్రాన్స్‌ఫార్మర్లు, మొబైల్ కెమెరా లెన్సులు, ఇతర భాగాలపై సుంకాల్లో రాయితీలు ఇస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ రాయితీలతో వీటి ధరలు తగ్గుతాయి. మొబైల్ ఫోన్ విడిభాగాల ధరలు తగ్గితే స్మార్ట్‌ఫోన్ తయారయ్యేందుకు ఖర్చు కూడా తగ్గుతుంది. కాబట్టి స్మార్ట్‌ఫోన్ ధరలు దిగి రావొచ్చు. అయితే రాయితీల ద్వారా తగ్గిన మొత్తాన్ని కంపెనీలు కస్టమర్లకు బదిలీ చేస్తే సామాన్యులకు మేలు జరుగుతుంది. అయితే రాయితీల ద్వారా ఎంత తగ్గుతుంది, చివరికి వచ్చేసరికి స్మార్ట్‌ఫోన్ ఎంత తగ్గుతుందన్నది ఇప్పుడే చెప్పలేం. కానీ సుంకాల్లో రాయితీలతో దేశీయంగా ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ, మొబైల్ పార్ట్స్ తయారీ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈ బడ్జెట్‌లో ఎలక్ట్రానిక్ వస్తువులు స్థానికంగా తయారు చేయడానికి పలు ప్రకటనలు చేశారు నిర్మలా సీతారామన్. వైర్డ్, వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్, స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్‌నెస్ బ్యాండ్స్ తయారీని పెంచేందుకు పలు కార్యక్రమాలు ప్రకటించారు. స్థానికంగా వీటి తయారీ పెరిగితే తక్కువ ధరకే ఈ ప్రొడక్ట్స్ అందుబాటులోకి వస్తాయి. రియల్‌మీ, షావోమీ, ఒప్పో, వివో, వన్‌ప్లస్, సాంసంగ్, యాపిల్ లాంటి కంపెనీలు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారతదేశంలోనే స్మార్ట్‌ఫోన్లను తయారు చేస్తున్నాయి. దేశంలో అమ్మే స్మార్ట్‌ఫోన్లు అన్నింటినీ దాదాపుగా ఇక్కడే తయారు చేస్తున్నాయి. దీంతో భవిష్యత్ టెక్నాలజీ స్థానికంగా అందుబాటులో ఉంటోంది. స్మార్ట్‌ఫోన్లను స్థానికంగా తయారు చేయడం వల్ల ఉపాధి పెరగుతోంది. మరోవైపు ఇతర దేశాల నుంచి స్మార్ట్‌ఫోన్లను దిగుమతి చేయడం కన్నా ఇక్కడే తయారు చేస్తుండటంతో మొబైల్స్ ధరలు తక్కువగా ఉంటున్నాయి. గతంలో చైనా కంపెనీలు ఇండియాలో అమ్మే స్మార్ట్‌ఫోన్లను అక్కడి నుంచే దిగుమతి చేసేవారు. షావోమీ, రియల్‌మీ, ఒప్పో, వివో లాంటి బ్రాండ్స్ ఇండియాలోనే తయారీ సంస్థల్ని ఏర్పాటు చేసి... మొబైల్స్‌ని ఇక్కడే తయారు చేస్తున్నాయి. గత కొంతకాలంగా స్మార్ట్‌ఫోన్ల ధరలు పెరుగుతున్నాయి. సెమీకండక్టర్ల కొరత, విడిభాగాల ధరలు పెరగడం లాంటి కారణాలతో స్మార్ట్‌ఫోన్ కంపెనీలు 10 శాతం వరకు ధరల్ని పెంచాయి. మరి త్వరలోనే ఈ ధరలు తగ్గుతాయో లేదో చూడాలి.
0 Comments