Ad Code

విండోస్‌11లో అందుబాటులోకి వచ్చిన ఆండ్రాయిడ్‌ యాప్స్‌


మైక్రోసాఫ్ట్‌ విండోస్‌11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌కు ఎట్టకేలకు ఆండ్రాయిడ్‌ యాప్స్‌ జతకలిశాయి. ఎంతో కాలంగా వేచిచూస్తున్న సదుపాయాన్ని మైక్రోసాఫ్ట్‌ తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చింది. విండోస్‌లో ఆండ్రాయిడ్‌ యాప్స్‌ ఎలా ఉండబోతున్నాయనే అంశంపై విండోస్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను లాంచ్‌ చేసే ముందు మైక్రోసాఫ్ట్‌ సంస్థ చూపించింది. అయితే, ఆ సదుపాయం విండోస్‌ 11 యూజర్లకు అందుబాటులోకి వచ్చే సరికి అందించలేకపోయారు. దీనికి సంబంధించి గత నెల మైక్రోసాఫ్ట్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. శుక్రవారానికి ఆండ్రాయిడ్‌ యాప్స్‌ను వినియోగించే సదుపాయం అందుబాటులోకి వస్తుందని, మరికొన్ని అప్ డేట్స్‌ కూడా ఉంటాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం,ఆ ఫీచర్‌ యూజర్లకు అందుబాటులోకి వచ్చేసింది. విండోస్‌ 11 వినియోగిస్తున్నవారు అమెజాన్‌ యాప్‌స్టోర్‌ నుంచి ఆండ్రాయిట్‌ యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. విండోస్‌లోని అమెజాన్ యాప్‌స్టోర్‌ ద్వారా 1,000కి పైగా ఆండ్రాయిడ్‌ యాప్‌లను, గేమ్స్‌ను అందిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్‌ ప్రకటించింది. విండోస్‌ 11 టెస్టింగ్‌ పీరియడ్‌లో పేర్కొన్న దాని కంటే ఇప్పుడు అందిస్తున్న యాప్‌లు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. అందులో ఉబర్‌, ఆడిబుల్‌, టిక్‌టాక్‌, సబ్‌వేసర్ఫెర్స్‌ వంటి గేమ్స్ డౌన్‌లోడ్‌ చేసుకొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే అవి మీ పెర్సనల్‌ కంప్యూటర్‌లో రన్‌ అవుతాయో? లేదో? చూసుకోవాల్సి ఉంది. ఆండ్రాయిడ్‌ యాప్స్‌ను విండోస్‌లో వినియోగించాలంటే ఉండాల్సిన మినిమం రిక్వైర్‌మెంట్స్‌ను మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. 8జీబీ ర్యామ్‌, ఎస్‌ఎస్‌డీ, సపోర్ట్‌ చేసే ప్రాసెసర్‌ తప్పనిసరి.

Post a Comment

0 Comments

Close Menu