'ఇండియా మొబైల్ కాంగ్రెస్- 2021' సదస్సులో పాల్గొన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ కీలక అంశాలపై మాట్లాడారు. దేశవ్యాప్తంగా కనెక్టివిటీని పెంచడానికి భారతదేశం తప్పనిసరిగా 5G టెక్నాలజీకి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. ప్రస్తుతం పరిశ్రమ 5G విప్లవానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో, భారతీయులను 2G నెట్‌వర్క్‌ల నుంచి 4Gకి త్వరగా మార్చాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. భారతీయులు టెక్నాలజీని ఆశావాదంతో స్వీకరించారు. కోవిడ్ సమయంలో చిప్స్ కొరత ఏర్పడినప్పుడు చిప్‌సెట్‌లే మనల్ని ముందుకు నడిపించాయి. కోవిడ్ లాక్‌డౌన్‌లు పరిస్థితులను తారుమారు చేసినప్పుడు సాంకేతికత మన జీవితాలను, జీవనోపాధిని కాపాడింది. భారతీయులు 2G నుంచి 4Gకి, 4G నుంచి 5Gకి వలసలను త్వరగా పూర్తి చేయాలి. లక్షలాది మంది భారతీయులను 2G టెక్నాలజీకి పరిమితం చేయడం అంటే, డిజిటల్ విప్లవం ప్రయోజనాలను వారికి దూరం చేయడమే. 5G రోల్-అవుట్ అంశం భారతదేశ జాతీయ ప్రాధాన్యతగా ఉండాలి. Jio నెట్‌వర్క్ 100% స్వదేశీ, సమగ్రమైన 5G సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేసింది. పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించే ఈ ఆధునిక టెక్నాలజీ, క్లౌడ్ సేవలను స్థానికంగా అందిస్తుంది. ఫ్యూచర్ ప్రూఫ్ ఆర్కిటెక్చర్ కారణంగా జియో నెట్‌వర్క్‌ను త్వరగా, సజావుగా 4G నుంచి 5Gకి అప్‌గ్రేడ్ చేయవచ్చు. భారతదేశంలో మొబైల్ సబ్‌స్క్రైబర్ బేస్ అసాధారణంగా, వేగంగా విస్తరించడానికి అందుబాటు ధరలు కీలకంగా మారాయి. మేము విధానాలపై నిర్ణయాలు తీసుకునే సమయంలో స్థోమత గురించి మాట్లాడేటప్పుడు, సేవల స్థోమత గురించి మాత్రమే ఆలోచిస్తాం. భారతదేశం కేవలం సేవల విషయంలో మాత్రమే కాకుండా, డివైజ్‌లు, అప్లికేషన్ల విషయంలో కూడా స్థోమతపై దృష్టిపెట్టాలి. ఫైబర్ అనేది అన్‌లిమిటెడ్ డేటా క్యారేజ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల భవిష్యత్తుకు సిద్ధంగా ఉండాలంటే, భారతదేశం ఫైబర్ టెక్నాలజీకి సిద్ధంగా ఉండాలి. ఈ కోవిడ్ కాలంలో కూడా జియో నెట్‌వర్క్ 50 లక్షల ఇళ్లకు 'ఫైబర్ టు హోమ్'ను పరిచయం చేయగలిగింది. పరిశ్రమ వర్గాలు కలిసి పని చేస్తే, గత దశాబ్దంలో మొబైల్ టెలిఫోన్‌ని దేశంలోని ప్రతి మూలకు చేరువ చేసినట్లుగానే, దేశవ్యాప్తంగా ఫైబర్ ఫుట్‌ప్రింట్‌ను వేగంగా సాధించగలం. పరివర్తన కోసం దోహదం చేసే మరో అంశం భారతదేశ శక్తి వ్యవస్థలు. స్మార్ట్ గ్రిడ్‌ల ద్వారా ఇంధన పొదుపు, ఆర్థిక వ్యవస్థను డీకార్బనైజేషన్ చేయడం, స్వచ్ఛమైన గ్రీన్ ఎనర్జీకి భారతదేశం పరివర్తన వ్యయాన్ని భారీగా తగ్గించడం.. వంటి లక్ష్యాల కోసం అధునాతన సాంకేతికతలు అభివృద్ధి చెందుతున్నాయి. మన పరిశ్రమ ప్రారంభించిన ఈ భారీ పరివర్తనలో ప్రజల రక్షణ, భూ గ్రహ రక్షణ అనే అంశాలు ఇమిడి ఉన్నాయి. ఇండియా మొబైల్ కాంగ్రెస్ అనేది భారతదేశం, దక్షిణాసియాలో నిర్వహించే అతిపెద్ద డిజిటల్ టెక్నాలజీ ఫోరమ్. మూడు రోజుల పాటు జరిగే ఈ అంతర్జాతీయ సదస్సులో సాంకేతికతకు సంబంధించిన అంశాలపై దృష్టి సారిస్తారు. ఈ కార్యక్రమం మన దేశంలోని స్టార్టప్, టెక్నాలజీ ఎకోసిస్టమ్‌కు ప్రముఖ వేదికగా పేరొందింది. ఈ ఏడాది ఇండియా మొబైల్ కాంగ్రెస్ డిసెంబర్ 8 నుంచి డిసెంబర్ 10 వరకు న్యూఢిల్లీ వేదికగా జరుగుతోంది. ఈ సదస్సులో ముఖేష్ అంబానీ వర్చువల్ విధానంలో పాల్గొని, మాట్లాడారు.
0 Comments