ట్విట్టర్ సహ-వ్యవస్థాపకుడు జాక్ డోర్సే రాజీనామా తర్వాత, కంపెనీ తన కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పరాగ్ అగర్వాల్‌ను నియమించింది. పరాగ్ అగర్వాల్‌ను అభినందిస్తూ సెలబ్రెటీలు, వ్యాపార దిగ్గజాలు ట్వీట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, పరాగ్ అగర్వాల్ సీఈవో పదవి చేపట్టడంతోనే ట్విట్టర్లో పెద్ద మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా యూజర్ల వ్యక్తిగత భద్రతను కాపాడేందుకు గోప్యతా విధానాన్ని అప్‌డేట్ చేస్తున్నట్లు ట్విట్టర్ ప్రకటించింది. ఈరోజు నుంచి, సమ్మతి లేకుండా ప్రైవేట్ వ్యక్తుల చిత్రాలు లేదా వీడియోలు షేర్ చేయడానికి కంపెనీ అనుమతించదని స్పష్టం చేసింది. ఇప్పటికే ఇంటి చిరునామా, గుర్తింపు పత్రాలు, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, మొబైల్ నంబర్ వంటి సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేసే మీడియా ఫైళ్లను కంపెనీ నిషేధించింది. అయినప్పటికీ, కొంత మంది వ్యక్తులు ఇతరుల గోప్యతకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారు. అందువల్ల వ్యక్తిగత వివరాలతో వేధింపులు లేదా దాడికి దారితీసే పోస్ట్‌లను కఠినంగా అణిచివేసే లక్ష్యంతో ఈ కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఈ కొత్త అప్‌డేట్ గురించి ట్విట్టర్ తన బ్లాగ్ పోస్ట్‌లో వివరిస్తూ ''ట్విట్టర్ నియమాలను కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారు. అటువంటి వారిని నియంత్రించేందుకు ఈ అప్డేట్ను తీసుకొస్తున్నాం. వ్యక్తుల అనుమతి లేకుండా వారి ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేయడం అనేది మా భద్రతా నిబంధనలకు వ్యతిరేకం. అటువంటి పోస్ట్‌ల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. ఈ కొత్త నిబంధన నేటి నుంచి ప్రపంచవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది." అని పేర్కొంది.
0 Comments