Ad Code

సముద్రంలో నీటి మీద తేలే నగరం


ఇప్పటివరకూ మనం భూమి మీద నగరాలు నిర్మించడం చూశాం. అప్పుడప్పుడు నీటి మీద తేలియాడే ఇళ్ళను చూశాం. మన దేశంలో కేరళలో వాటిని మనం చూస్తూనే ఉంటాం. కానీ మొదటిసారిగా నీటిమీద తేలియాడే నగరం సిద్ధం అవుతోంది. నీటి మీద తేలుతూ పదివేల కుటుంబాలు నివసించదానికి వీలు కల్పించే అద్భుతం త్వరలో అందుబాటులోకి వస్తోంది. ఈ నీటిమీద తేలియాడే నగరం దక్షిణ కొరియా తీర నగరమైన బుసాన్ సమీపంలో రూపుదిద్దుకుంటుం దని చెబుతున్నారు. ఈ నగర నిర్మాణానికి 200 మిలియన్ల డాలర్లు ఖర్చవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు మొత్తం 75 హెక్టార్లలో నిర్మితం అవుతోంది. ఇక్కడ పదివేల కుటుంబాలకు వసతి కల్పించాలనేది ప్లాన్. ఈ ప్రాజెక్టు 2025 నాటికి పూర్తి అవుతుందని చెబుతున్నారు.ఈ నీటిమీద తేలియాడే స్థిరమైన నగరాన్ని హాబిటాట్ కు చెందిన న్యూ అర్బన్ ఎజెండా..న్యూయార్క్ కు చెందినా ఓషియానికస్ కలిసి అభివృద్ధి చేస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే బుసాన్ మెట్రోపాలిటన్ సిటీ ఆమోదం పొందింది. అన్ని రకాల ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే విధంగా భవనాలను నిర్మించనున్నారు. ప్రతి ఇల్లు సముద్రం దిగువన లంగరు వేస్తారు. ఇది వరదలు అదేవిధంగా కేటగిరీ 5 తుఫానులను తట్టుకునేలా రూపొందిస్తున్నారు. ఒక పక్క అధికారులు నిర్మాణ పనుల్లో ముందుకెళ్తుండగా.. ఇక్కడ జీవన వ్యయం, నిర్వాసితులెవరు, వారిని ఎంపిక చేసే ప్రమాణాలేమిటన్న దానిపై ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక్కడ నివాసితులకు ఆహారం అక్కడే పండించే ప్రణాళిక సిద్ధం చేశారు. నివసితులకు ప్రారంభంలో కాయగూరలు అందిస్తారు. తరువాత అక్కడ కూరగాయల పంటలు పండించే ఏర్పాటు చేస్తారు. ఈ మొక్కలకు చేపల ద్వారా ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను ఎరువుగా వినియోగిస్తారు. అదనంగా, వ్యవసాయ పద్ధతులుగా ఏరోపోనిక్, ఆక్వాపోనిక్ వ్యవస్థలను ఉపయోగించుకుంటారు. ఏరోపోనిక్స్ అనేది మట్టి లేకుండా మొక్కలను పెంచే పద్ధతి. ఆక్వాపోనిక్స్ అనేది బ్యాక్టీరియాను ఉపయోగించి మొక్కలను పెంచే పద్ధతి. భవనాలు ఏడు అంతస్తుల కంటే ఎక్కువ ఉండవు. అయినప్పటికీ నగరం మొత్తం పరిమాణం గాలి నిరోధకత పరంగా నిర్ణయిస్తారు. ఇదిలా ఉండగా హెక్టార్ల విస్తీర్ణంలో సముద్రగర్భంలో నగరాన్ని నిర్మించడంపై ప్రపంచంలోని అనేక ప్రాంతాల నుండి విమర్శలు పెరుగుతున్నాయి. అలాగే, పెరుగుతున్న సముద్ర మట్టాలు, వాతావరణ మార్పులు ప్రాజెక్టుకు సవాలుగా మారుతున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu