ఉద్దానం మత్స్యకారుల వలలో వరాలు పడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో అరుదుగా దొరికే ట్యూనా చేపలు నాలుగు రోజులుగా ఇక్కడి గంగపుత్రులకు దండిగా దొరుకుతున్నాయి. టన్నుల కొద్దీ చేపలను ఇతర రాష్ట్రాలకు తరలించి వారు సంబరపడుతున్నారు. జిల్లాలో అక్టోబర్-డిసెంబర్ మధ్యకాలంలో ఉద్దానం తీరాల్లో తక్కువ మొత్తంలోనే ట్యూనా దొరికేది. ఎవరికో గానీ ఆ అదృష్టం వరించేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం దాదాపుగా వేటకు వెళ్లిన అన్ని వలలకు ట్యూనా చేపలు పడటం విశేషం. జిల్లాలో సోంపేట, కవిటి మండలాల పరిధిలోనే ట్యూనా చేపలు లభ్యమవుతున్నాయని స్థానిక మత్స్యకారులు, అధికారులు చెబుతున్నారు. బారువ, ఇసుకలపాలెం, ఉప్పలాం, గొల్లగండి తదితర తీర ప్రాంతాల్లో గత నాలుగైదు రోజుల నుంచి భారీగా ట్యూనా చేపలు లభ్యమయ్యాయి. ఈ చేపల లభ్యత సమాచారాన్ని తెలుసుకున్న చేపల వ్యాపారస్తులు స్థానికులతో ఫోన్లలో బేరాసారాలు చేసుకుని రవాణా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే గత నాలుగు రోజుల్లో సుమారు 200 టన్నుల ట్యూనా చేపలు కేరళ, ఒడిశా, కర్ణాటక తదితర రాష్ట్రాలకు తరలించారు. తొలి రెండు రోజుల్లో కిలో చేపల ధర రూ.30 వరకు ఉంటే, ఇప్పుడు రూ.38 నుంచి రూ.45కి చేరింది. ఇదే ధరలతో కేరళకు భారీగా చేపలు విక్రయాలు జరిగినట్లుగా మత్స్య శాఖాధికారులు చెబుతున్నారు. ఇక ఈ చేపలకు జపాన్ తదితర నార్త్ ఈస్ట్ దేశాల్లో గిరాకీ అధికంగా ఉండడంతో ఇక్కడి నుంచి చేపలను ఎగుమతి చేసేందుకు వ్యాపారులు సన్నాహాలు చేస్తున్నారు. ట్యూనా చేపలను స్థానికంగా సూరలని పిలుస్తుంటారు. ఇక్కడి వారి కంటే ఇతర దేశస్తులు అధికంగా ఆహారంగా తీసుకుంటారు. గతంతో పోల్చితే ఈసారి అధికంగా చేపల సంతతి బయటపడటంతో అక్కడి వలలకు చిక్కాయి. దేశంలోనే చేపల అభివృద్ధిలో ప్రథమ స్థానంలో మన రాష్ట్రం నిలిచింది. అలాగే ఇందులో మన జిల్లా కూడా ప్రాధాన్యతను పొందడం విశేషం.
0 Comments