Ad Code

నోబల్ బహుమతికి 126 ఏళ్లు..!

 

ప్రపంచంలో శాస్త్రవేత్తలంతా ఆ బహుమతి కోసం తహ తహలాడి పోతారు. జీవితంలో ఎన్ని సాధించినా  ఆ బహుమతి వస్తే దాని దారి వేరే అని భావిస్తారు. అదే నోబెల్ ప్రైజ్. వివిధ రంగాల్లో అభివృద్ధికోసం అవిరాళ కృషి చేసి.. ప్రపంచ ప్రజల జీవితానికి ఉపయోగపడే అద్భుత ఆవిష్కరణలు చేసిన వారికి ప్రతి ఏటా ఈ నోబెల్ బహుమతులు ప్రదానం చేస్తారు. ఇంత ప్రఖ్యాతి గాంచిన ఈ బహుమతి 1895 నవంబర్ 27న  ప్రారంభించారు. అప్పట్లో ప్రముఖ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ బెర్న్‌హార్డ్ నోబెల్ మనసులో వచ్చిన ఆలోచనకు ప్రతిరూపం నోబెల్ ప్రైజ్. ఆయన సంకల్పానికి ప్రతీకగా ఈ అవార్డులు ఇవ్వడం మొదలు పెట్టారు. మొదట్లో, నోబెల్ భౌతిక శాస్త్రం, వైద్యం, రసాయన శాస్త్రం, సాహిత్యం అలాగే శాంతి రంగాలలో మాత్రమే ప్రదానం చేసేవారు. తర్వాత ఆర్థిక శాస్త్రంలో కూడా నోబెల్‌ను ప్రదానం చేయడం మొదలు పెట్టారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ 21 అక్టోబర్ 1833 న జన్మించాడు. 1842లో తన తండ్రి, ఇమాన్యుయేల్ నోబెల్ దివాలా తీసిన తర్వాత, తొమ్మిదేళ్ల వయసులో, నోబెల్ తన తల్లి ఆండ్రీటా ఎల్సెల్‌తో కలిసి సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని తన తల్లిదండ్రుల అమ్మమ్మ తాతయ్యల ఇంటికి మారాడు. ఇక్కడ అతను కెమిస్ట్రీతో పాటు , స్వీడిష్, రష్యన్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్ భాషలను నేర్చుకున్నాడు. మైనింగ్ పరిశ్రమలో ఉపయోగించే పేలుడు పదార్ధం డైనమైట్ ను కనుగొన్నది ఈయనే. డైనమైట్‌ను కనుగొన్న తర్వాత, ఇది నిర్మాణ పరిశ్రమలో విస్తృతంగా ఉపయోగించేవారు. ఆల్ఫ్రెడ్ 90 ప్రదేశాలలో డైనమైట్ ఫ్యాక్టరీలను ప్రారంభించాడు. ఇవి 20 కంటే ఎక్కువ దేశాలలో ప్రారంభం అయ్యాయి. ఆయన అప్పట్లో ‘యూరప్‌లోని అత్యంత ధనవంతుడు’గా నిలిచారు. డైనమైట్ తరువాత ఆయన చాలా ఆవిష్కరణలు చేశారు. ఇప్పుడు ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరుమీద 355 పేటెంట్లు ఉన్నాయి. అంటే ఆయన ఎన్నిరకాలైన ఆవిష్కరణలు ప్రపంచానికి అందించారో అర్ధం చేసుకోవచ్చు. వీటన్నిటిలోనూ డైనమైట్ కారణంగానే ఆయన ప్రజలకు ఎక్కువగా పరిచయం అయ్యారు. నిర్మాణ పనుల కోసం తాను కనిపెట్టిన డైనమైట్‌ను దుర్వినియోగం కావడం చూసి ఆల్‌ఫ్రెడ్‌ తన ఆవిష్కరణకు బాధపడ్డాడని చెబుతారు. దీంతో తన వీలునామాలో, తన ఆస్తి నుండి మానవాళికి ప్రయోజనం చేకూర్చిన వ్యక్తులకు బహుమతి ఇవ్వాలనే కోరికను వ్యక్తం చేశాడు. ఆల్ఫ్రెడ్ నోబెల్ తన చివరి వీలునామాను 27 నవంబర్ 1895న రాశాడు. ఈ వీలునామా ఆధారంగానే నోబెల్ బహుమతులు ఏర్పాటు చేశారు. నోబెల్ బహుమతులు మొదటిసారిగా 1901లో అందించారు. ఇప్పటివరకు 975 మంది వ్యక్తులు, సంస్థలకు 609 నోబెల్ బహుమతులు లభించాయి.

Post a Comment

0 Comments

Close Menu