Ad Code

సముద్ర నాచు పెంపకానికి ప్రోత్సాహం


దేశంలో పెద్దయెత్తున సముద్ర నాచు పెంపకానికి పూర్తి ప్రోత్సాహం ఇవ్వనున్నట్టు కేంద్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని జాతీయ మత్స్య పరిశ్రమాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎఫ్‌డీబీ)ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా 'ఎన్‌ఎఫ్‌డీబీ' ఆర్థిక సహాయంతో చేపట్టిన, అమలు చేస్తున్న కొన్ని కార్యక్రమాలను ప్రారంభించడంతోపాటు సంస్థ కార్యకలాపాలను కూడా ఆయన సమీక్షించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశంలో పెద్దఎత్తున సముద్ర నాచు పెంపకానికి పూర్తి ప్రోత్సాహం ఇవ్వనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇందులో భాగంగా దేశమంతటా ఇటువంటి యూనిట్ల ఏర్పాటుకు తగిన ప్రదేశాలను గుర్తించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. సముద్ర నాచు, పంజరాల్లో చేపల పెంపకం నేటి ఆధునిక విధానాలని, మత్స్యకారులతోపాటు మహిళల సాధికారత లక్ష్యంగా 'ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన' (పీఎంఎంఎస్‌వై) కింద వీటిని ప్రభుత్వం చురుగ్గా ప్రోత్సహిస్తున్నదని ఆయన గుర్తుచేశారు. "ఔషధ విలువలున్న సముద్రపు నాచుకు జాతీయంగా, అంతర్జాతీయంగా ఎంతో గిరాకీ ఉంది. సముద్ర నాచు పెంపకం మత్స్యకారులకు ప్రత్యేకించి మహిళల సాధికారతకు ఎంతగానో తోడ్పడుతుంది" అని మంత్రి చెప్పారు. ఈ నేపథ్యంలో సముద్ర నాచు ఎకనమిక్‌ పార్క్‌ తమిళనాడులో రూపుదిద్దుకుంటున్నదని, దేశవ్యాప్తంగా ఇలాంటి పార్కులు ఇంకా ఏర్పాటవుతాయని వెల్లడించారు. చేపల వేటద్వారా మత్స్యకారుల ఆర్జనను గణనీయంగా పెంచడం కోసం కేంద్ర ప్రభుత్వం వ్యూహాలు రూపొందిస్తోంది. ఆ మేరకు చేపలవేట కార్యకలాపాలకు ప్రోత్సాహం ఇవ్వడం కోసం స్వయం సమృద్ధ భారతం ప్యాకేజీ కింద రూ.20,000 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో ల్యాండింగ్‌ సెంటర్లు, ఫిషింగ్‌ హార్బర్లు, ప్రాసెసింగ్‌ యూనిట్లు, కోల్డ్‌ స్టోరేజీ సదుపాయాల అభివృద్ధి, ఆధునికీకరణకు చర్యలు చేపడుతుంది. అంతేకాకుండా దేశీయంగా చేపలవేటకు మద్దతిస్తూ అత్యాధునిక పద్ధతులను ప్రోత్సహిస్తుంది. దీంతోపాటు 'ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన' (పీఎంఎంఎస్‌వై) కింద ప్రతిపాదించిన వివిధ పథకాల ద్వారా మత్స్య ఎగుమతులను పెంచనుందని మంత్రి వెల్లడించారు. మత్స్యకారులందరికీ త్వరలోనే 'కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌' జారీ చేయనున్నట్లు డాక్టర్‌ ఎల్‌.మురుగన్‌ తెలిపారు. ఈ నిర్ణయానికి అనుగుణంగా వ్యవసాయ శాఖ ప్రతిపాదనలతోపాటు ప్రామాణీకృత నిర్వహణ విధివిధానాలను రూపొందిస్తున్నదని చెప్పారు. ప్రభుత్వం 2021-22 బడ్జెట్‌లో ప్రకటించిన మేరకు కోచ్చి, చెన్నై, విశాఖపట్నం, పారాదీప్‌సహా ఐదు చోట్ల అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబోయే ఫిషింగ్‌ హార్బర్లకు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. "ఇళ్లకు వస్తువుల చేరవేత, అత్యవసర సమయాల్లో సహాయం, శాంతిభద్రతల పరిరక్షణసహా రవాణా రంగంలో మానవరహిత సూక్ష్మ విమానాల (డ్రోన్‌) వినియోగానికి భారత్‌ కృషి చేస్తోందని తెలిపారు. ఇటువంటి అవసరాల కోసం త్వరలోనే డ్రోన్లను రంగంలో దింపనుంది. ఇప్పటికే కోవిడ్‌-19 టీకాల చేరవేత కోసం డ్రోన్లు వాడకంలో ఉన్నాయి" అని ప్రధానమంత్రి 'మన్‌ కీ బాత్‌' ప్రసంగాన్ని ఉటంకిస్తూ మురుగన్‌ తెలిపారు. భవిష్యత్తులో డ్రోన్ల సాంకేతిక పరిజ్ఞానం కీలకపాత్ర పోషించనుందని మంత్రి ఈ సందర్భంగా అన్నారు.ఈ కార్యక్రమానికి ముందు- బీహార్‌లో అత్యంత భారీ మంచినీటి రొయ్య పిల్లల అభివృద్ధి సాంకేతిక పరిజ్ఞాన కేంద్రానికి సంబంధించి 'ఎన్‌ఎఫ్‌డీబీ' నిధులతో డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయ 'కాలేజ్‌ ఆఫ్‌ ఫిషరీస్‌' ఏర్పాటు చేసిన హేచరీని మంత్రి వర్చువల్‌ మార్గంలో ప్రారంభించారు. మత్స్యకారులు, ఆక్వా రైతులు, ఇతర భాగస్వాములకు 'పీఎంఎంఎస్‌వై' మీద అవగాహన కోసం రూపొందించిన లఘు ప్రచార గీతాలను ఆవిష్కరించారు. 'మత్స్య, ఆక్వాకల్చర్‌ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి' (ఎఫ్‌ఐడీఎఫ్‌)కి సంబంధించి 'ఎన్‌ఎఫ్‌డీబీ' 9 భాషల్లో రూపొందించిన ప్రచురణలను కూడా మంత్రి విడుదల చేశారు. పోషణ మాసోత్సవం-2021లో భాగంగా 'ఎన్‌ఎఫ్‌డీబీ' నిర్వహించిన వంటల పోటీల్లో విజేతలకు ఆయన బహుమతి ప్రదానం చేశారు. ఈ పోటీల్లో తెలంగాణ మహిళ శ్రావణి తృతీయ స్థానంలో నిలిచి మంత్రి చేతులమీదుగా బహుమతి అందుకున్నారు. కాగా, 'ఎన్‌ఎఫ్‌డీబీ' ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రదర్శన యూనిట్లను, ఆక్వాటిక్‌ యానిమల్‌ హెల్త్‌ అండ్‌ క్వాలిటీ టెస్టింగ్‌ లేబొరేటరీని డాక్టర్‌ మురుగన్‌ సందర్శించారు.

Post a Comment

0 Comments

Close Menu