ఉషాపరిణయం

 


పూర్వం బాణాసురుడనే ఆయన ఉండేవాడు. ఆయనకి వేయి బాహువులు. బలిచక్రవర్తికి నూర్గురు కుమారులు. ఆ నూర్గురు కుమారులలో పెద్దవాడు బాణాసురుడు. అతను శోణపురమును పరిపాలన చేస్తున్నాడు. వేయి చేతులు వున్న బాణాసురుడు ఒకరోజున కైలాస పర్వతం మీదికి వెళ్ళాడు. అది అసురసంధ్య వేళ. ఆ సమయంలో పరమశివుడు తాండవం చేస్తున్నాడు. బాణాసురుడు అక్కడ ఉండేటటువంటి అయిదువందల వాద్య పరికరములను తీసుకుని తన వేయి చేతులతో మ్రోగించాడు. పరమశివుడు తాండవం చేసిన పిదప సింహాసనం మీద కూర్చుని పొంగిపోయాడు. ‘వేయి చేతులతో అయిదువందల వాద్య పరికరములను ఎంతో గొప్పగా వాయించావు’ అని బాణాసురుడిని మెచ్చుకున్నాడు. అతను పరుగు పరుగున వచ్చి శంకరుని స్తోత్రం చేశాడు. బాణాసురుడు చేసిన స్తోత్రమును విని శంకరుడు ‘నీకు ఏమి కావాలో కోరుకో, ఇస్తాను’ అన్నాడు. అపుడు వానిలో వున్న అసురీ ప్రవృత్తి బయటకు వచ్చింది. అతడు చిత్రమయిన కోరిక కోరాడు  “ఈశ్వరా! నేను ఎప్పుడూ నీ పాదములను ఆశ్రయించి ఉంటాను. నీవు మాత్రం నాకొక ఉపకారం చేసిపెట్టాలి. పార్వతీ దేవితో కలిసిన వాడివై, నేను కోట లోపల ఉంటె నీవు నా కోట బయట కాపలా కాస్తూ ఉండాలి. ఇది నా కోరిక. నీవు భక్తుల కోర్కెలు తీర్చడంలో వశుడవయిపోయే వాడివి కదా! అందుకని నాకీ కోరిక తీరుస్తావా” అని అడిగాడు. అపుడు శంకరుడు వానికేసి చిత్రంగా చూశాడు. కాని ఈశ్వరుని కారుణ్యము చాలా గొప్పది. బాణాసురుని కోరిక తీర్చడానికి అంగీకరించాడు. పార్వతీదేవితో కలిసి త్రిశూలం పట్టుకుని కోట బయట అటు యిటూ తిరుగుతున్నాడు. శంకరునితో పాటు ఆయన అనుయాయులు అందరూ కూడా అక్కడికి వచ్చేశారు. ఈవిధంగా శంకరుడు కోటబయట తన పరివారంతో ఉంటూ కోటను రక్షిస్తూ ఉండేవాడు. ఎప్పుడయితే పరమశివుడు బాణాసురుని కోటకు కాపుదలగా ఉన్నాడని తెలిసిందో యిక బాణాసురుని వైపు కన్నెత్తి చూసిన వాడు లేడు. ఒకరోజు కోట బయట కాపలా కాస్తున్న శంకరుని వద్దకు వచ్చి ‘శంకరా! ఆరోజు నేను కోరిన కోరికను మన్నించి మీరు వచ్చి నా కోటకు కాపలా కాస్తున్నారు. ఎవడూ వచ్చి నాతో యుద్ధం చేయడం లేదు. కానీ నాకు యుద్ధం చేస్తుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. మీరు ఏమీ అనుకోకపోతే దయచేసి నాతో ఒక పర్యాయం యుద్ధం చేయవలసింది’ అని కోరాడు. 

భగవంతుని కారుణ్యం వానికి చులకనగా కనపడింది. ఈశ్వరుడు తెల్లబోయాడు. ఇపుడు ఈశ్వరునికి ఒక ఇబ్బంది వచ్చింది రక్షించవలసిన వాడూ తానే. వాడు అడిగిన కోరికకు శిక్షించ వలసిన వాడూ తానే. ఈ రూపంతో రక్షణ చేస్తూ శిక్షను ఈయనకు వున్న ఇంకొక రూపంతో వేయాలి. “నాతో సమానమయిన ఇంకొకడు నీ దగ్గరకు వస్తాడు. వాని రాకకు గుర్తుగా నీ రథమునకు వున్న జండా క్రింద పడిపోతుంది. అప్పుడు నీకు తగిన యుద్ధం దొరుకుతుంది. అప్పుడు నీకున్న వ్యగ్రత పోతుంది” అన్నాడు. 

పరమేశ్వరుని మాటలు విని బాణాసురుడు చాలా సంతోషించాడు. ఆరోజు గురించి ఎదురుచూస్తున్నాడు.

ఇపుడు ఈశ్వరుడు ఒక చమత్కారం చేశాడు. 

బాణాసురునికి మంచి యౌవనంలో వుండి అతి సౌందర్యవతి అయిన కుమార్తె ఒకతె ఉన్నది. ఆమె పేరు ఉష. ఆమె ఒకరోజు రాత్రి నిద్రపోతోంది. పురుషుల గురించి ఆమెకు ఏమీ తెలియదు. నిద్రపోతున్న ఉష కలలోకి కృష్ణ భగవానుడి మనుమడయిన అనిరుద్ధుడు వచ్చి ఆమెతో రమించాడు. ఆమెకు సుఖానుభూతి కొన్ని కొన్ని గుర్తుల చేత స్పష్టముగా తెలిసింది. ఆవిడ నిద్రలేచింది. కానీ ఆవిడ నిన్నరాత్రి కలలో ఏ పురుషుడిని చూసిందో ఆ పురుషుడి కోసమని ఆమె మనస్సు గతి తప్పి తిరగడం మొదలుపెట్టింది. అందువలన ప్రతిరోజూ ఎలా ఉంటుందో అలా ఉండలేకపోయింది. చాలా దిగులు చెందింది. ఈమెకు చిత్రలేఖ అనబడే అనుంగు చెలికత్తె ఒకతె ఉన్నది. ఆవిడ వచ్చి “నీవు ఎందుకు అలా ఉంటున్నావు? నీ ప్రవర్తనలో వచ్చిన మార్పువలన నేను ఒక విషయమును గమనించాను. నీవు ఎవరో ఒక పురుషుని వలపులో పడ్డావని నేను అనుకుంటున్నాను. నేను నీ చెలికత్తెను. ప్రాణ స్నేహితురాలను. కాబట్టి అసలు జరిగిన విషయం ఏమిటో నాకు చెప్పవలసింది’ అని అడిగింది.  అపుడు ఉష తన స్వప్న వృత్తాంతం చెప్పింది.  చిత్రలేఖ ‘సఖీ! నీవేమీ బెంగ పెట్టుకోవద్దు. నీకు కలలో కనిపించిన వాడు ఎలా ఉంటాడో నీవు చెప్పావు. నేను ఎందరో రాజాధిరాజులను చూశాను. వాళ్ళ చిత్ర పటములను గీస్తాను. అవి చూసి ఇందులో ఎవరు కనపడ్డారో చెప్పు’ అని రాజకుమారుల బొమ్మలను చిత్రీకరించింది. పిమ్మట ఉషాదేవిని పిలిచి ఆ చిత్రములను చూడమని చెప్పి వాళ్ళందరి గురించి పేరు పేరునా వివరించింది. 

అనిరుద్ధుని చిత్రమును ఆమె గుర్తించింది. అపుడు చిత్రలేఖ ‘ఆయన పేరు అనిరుద్ధుడు. ఆయన యందా నీవు మనసు పడ్డావు. సఖీ! ఇప్పుడు నేను నీకొక గొప్ప ఉపకారం చేస్తాను. నాకు కామరూపం తెలుసు. అందుకని ఇవాళ రాత్రి నేను ద్వారకానగర ప్రవేశం చేసి నిద్రపోతున్న అనిరుద్ధుడిని అపహరించి తీసుకువచ్చి నీ హంస తూలికా తల్పం మీద పడుకోబెడతాను. నీవు హాయిగా నీ ప్రియుడితో క్రీడించు.’ అని చెప్పి రాత్రికి రాత్రి ద్వారకకు బయలుదేరింది. బయట మూడుకన్నులున్న వాడు ఆమె వెళ్ళడం చూసి కూడా ఊరుకున్నాడు. ఈయన వరం నిలబెట్టవలసిన వాడు అక్కడ ఉన్నాడు. శివకేశవుల ఇద్దరి మనస్సులు ఒక్కటే. అందుకని అక్కడ కృష్ణ భగవానుడు అక్కడ ఏమీ తెలియనట్లు పడుకున్నాడు. చిత్రలేఖ అనిరుద్ధుని మందిరంలో ప్రవేశించి నిద్రపోతున్న అనిరుద్ధుని ఒక్కసారి సమ్మోహనం చేసి ఆయనను తీసుకొని ఆకాశమార్గంలో తిరిగి వచ్చేసి తిరిగి లోపలి వెళ్ళిపోయింది.  చిత్రలేఖ మరొక పురుషుని తీసుకొని కోటలోపలికి వెళ్ళడం బయట కోటకి కాపలా కాస్తున్న మూడు కన్నులవాడు చూశాడు. ఏమీ అభ్యంతర పెట్టలేదు. చిత్రలేఖ అనిరుద్ధుడిని తీసుకువెళ్ళి ఉషాదేవి మందిరంలో హంసతూలికా తల్పం మీద పడుకోపెట్టేసింది. ఇదంతా పరమాత్మ సంకల్పం. ఆయన ద్వారకలో కృష్ణుడిగా ఉన్నాడు. ఇక్కడ శివుడిగా ఉన్నాడు. ఒక మూర్తియే రెండుగా ఉన్నాడు. ఉషాదేవి తన ప్రియుడిని గుర్తించింది. అనిరుద్ధుడు కూడా వేరు అభ్యంతరం చెప్పకుండా ఆమెతో ఆటపాటలు మొదలుపెట్టాడు. వారిద్దరూ సంతోషంగా అలా అంతఃపురంలో కాలం  గడిపేస్తున్నారు. నెలలు నెలలు కాలం గడిచిపోతున్నది. కానీ కాలం ఎల్లప్పుడూ ఒకేరీతిగా ఉండదు. ఉషాదేవి యందు గర్భిణి చిహ్నములు కనపడ్డాయి. ఈ విషయమును పరిచారికలు వెళ్ళి బాణాసురునికి చెప్పారు. బాణాసురునికి ఎక్కడలేని ఆగ్రహం వచ్చి ‘ఎవరు ఈ తుంటరి పని చేసినవాడు’ అని ఉషాదేవి అంతఃపురమునకు వచ్చి కూతురుని అడిగాడు. ఎదురుగా అనిరుద్ధుడు కనపడ్డాడు. అనిరుద్ధుని బంధించమని భటులను ఆజ్ఞాపించాడు. భటులు వెళ్లి అనిరుద్డుడిని బంధించడానికి ప్రయత్నించగా అనిరుద్ధుడు తన గదా ప్రహారములతో వారినందరినీ పరిమారుస్తున్నాడు. బాణాసురునికి ఆగ్రహం వచ్చి అనిరుద్ధుని నాగ పాశముల చేత బంధించాడు. అలా బంధింపబడిన అనిరుద్ధుడు యిక కదలలేక నిలబడిపోయాడు. ఇది చూసి ఉషాదేవి విలపిస్తోంది. ఇదే సమయంలో అక్కడికి భటులు వచ్చి ప్రభూ మీ రథం మీద ఉన్న జండా విరిగి క్రిందపడిపోయింది అని చెప్పారు. 

తనతో యుద్ధము చేయడానికి ఎవరో వచ్చేశారని అతడు భావించి ఇన్నాళ్ళకు తన కోరిక తీరబోతున్నదనుకొని బయలుదేరాడు. అసురీవృత్తి ఎటువంటిదో చూడండి. వానికి కూతురి గొడవ అక్కరలేదు. యుద్ధం కావాలి.

ఈలోగా అక్కడ నారదుడు ద్వారకలో దిగాడు. ఏమీ ఎరగని వాడిలా అనిరుద్ధుని కోసం వెతుకుతున్నట్లు నటిస్తున్నాడు కృష్ణుడు. నారదుడు ‘అనిరుద్ధుడిని బాణాసురుడు నాగ పాశములతో బంధించాడు. నీవు వెంటనే బయలుదేరవలసినది’ అని చెప్పాడు. 

వెంటనే బలరాముడు, కృష్ణుడు, సాత్యకి, ప్రద్యుమ్నుడు అందరూ కొన్ని కోట్ల సైన్యంతో నదులు పొంగి ప్రవహిస్తున్నాయా అన్నట్లు బయలుదేరి శోణపురం మీదికి యుద్ధమునకు వెళ్ళారు. బాణాసురునికి ఎక్కడలేని సంతోషం వచ్చేసింది. వాడు శంకరుని పిలిచి “నీవు నన్ను రక్షణ చేయడానికి కదా కోటకు కాపు వున్నావు. నీవు కృష్ణుడు కోటలోపలికి రాకుండా యుద్ధం చేయాలి. అప్పుడు మాత్రమే నీవు నాకిచ్చిన వరం నిలబెట్టినట్లు అవుతుంది. కాబట్టి ముందుగా నీవు యుద్ధం చేసి, కృష్ణుడు తన పరివారంతో కోటలోకి రాకుండా ఆపవలసింది”అని అన్నాడు.

శంకరుడు భక్త వత్సలుడు. భక్తునికి ఇచ్చిన మాట తప్పడానికి వీలు లేదు. కాబట్టి యిపుడు శంకరుడు కృష్ణుడితో యుద్ధం చేయాలి. కృష్ణుడి చేతిలో ఓడిపోవాలి. శంకరుడు భక్తవశంకరుడై తనతో యుద్ధం చేస్తున్నాడని కృష్ణుడికి తెలుసు. యుద్ధం ప్రారంభం అయింది. శివుడు యుద్ధంలో లొంగనంత సేపు బాణాసురుని జోలికి కృష్ణుడు వెళ్ళడానికి వీలులేదు. తన వరం నిజం కావాలంటే కృష్ణుడి చేతిలో తాను ఓడిపోతే అవతల తానిచ్చిన వరమునకు మినహాయింపు యిచ్చినట్లు అవుతుంది. శంకరుడు యుద్ధం చేసి కృష్ణుడి చేత ప్రయోగింపబడిన బాణపు దెబ్బకు నందీశ్వరుని మీద వాలిపోయాడు. అప్పుడు కృష్ణుడు బాణాసురుని మీదకు యుద్ధమునకు బయలుదేరాడు. శివజ్వరము అనబడే శక్తి ఒకటి బయలుదేరింది. అది కృష్ణుడితో యుద్ధం చేస్తోంది. కృష్ణుడు వైష్ణవ జ్వరమును ప్రకోపం చేశాడు. ఆ రెండు శక్తులు ఒకదానితో ఒకటి డీకొన్నాయి. ఆ రోజున శివజ్వరం విష్ణువును ప్రార్థన చేసింది.

ఉషాపరిణయ ఘట్టంలో పార్వతీ పరమేశ్వరుల వలన, కృష్ణ భగవానుడి వలన లోకమునకు ఒక గొప్ప ప్రయోజనం వచ్చింది. ఆ రోజున కృష్ణ భగవానుడు ఒక వరం ఇచ్చాడు. ఎవరు ఉషాపరిణయ ఘట్టంలో శివజ్వరం, విష్ణుజ్వరం యుద్ధం చేయడం అనే ఘట్టంలో శివజ్వరం చేసే శరణాగతి విన్నారో, వారికి ఎప్పుడూ కూడా ప్రాణాంతకమయినదిగా జ్వరము బాధించడానికి వీలులేదు. ఆ మేరకు నేను వరం యిస్తున్నాను అన్నాడు. కాబట్టి ఎప్పుడయినా జ్వరము చేత ప్రాణాంతకం అవుతోందని అనుకుంటే ఉషా పరిణయమును శరణాగతి తత్త్వమును చదువుకోవడం కోసమని ఒకసారి పారాయణం చేస్తారు. అంత గొప్ప వరమును యిస్తే ఆ రోజున శివజ్వరం ఉపశాంతిని పొందింది. వెంటనే బాణాసురుడు యుద్ధమునకు వచ్చాడు. పరమాత్మ చేసిన యుద్ధం వలన ఆ రోజున బాణాసురుడు పడిపోయే పరిస్థితి వచ్చింది. తన కొడుకును ఎలాగైనా రక్షించుకోవాలని బాణాసురుని తల్లియైన కోటర ఆ రోజున యుద్ధమునకు వచ్చి ఒంటిమీద ఉన్న వలువలన్నిటిని విప్పేసి, జుట్టు విరబోసుకుని చేతులు పైకెత్తి హాహాకారం చేస్తూ కృష్ణుడికి ఎదురు నిలబడింది. ఒక స్త్రీ వివస్త్రయై జుట్టు విడివడి ఎదురునిలబడితే ఛీ అని తల తిప్పుకుని ధనుస్సు పక్కన పెట్టి కృష్ణ పరమాత్మ యుద్ధం ఆపేశాడు.  బాణాసురుడు కోటలోకి పారిపోయాడు. మరునాడు మరల యుద్ధం ప్రారంభం అయింది. అపుడు శంకరుడు కృష్ణుణ్ణి ప్రార్థన చేశాడు. ‘నేను కోట బయట రక్షణగా ఉన్నంత కాలం వీడు పడిపోవడానికి వీలులేదు. కాబట్టి తగిన విధంగా నీవు వానికి శిక్ష వేయవలసినది అని. శివకేశవుల హృదయములు ఒకరికొకరు తెలుసు. ఉన్న ఒక్క పదార్ధం రెండుగా కనపడుతోంది. కాబట్టి ఆరోజు కృష్ణ భగవానుడు బాణాసురునకు ఉన్న బాహువులలో 996బాహువులను సుదర్శన చక్రధారల చేత తెంచేశాడు. నాలుగు బాహువులను వదిలేశాడు. అపుడు వానికి ధర్మార్థ కామ మోక్షములు తెలిశాయి. ఇప్పుడు వాని శరీరమునందు రజోగుణ తమో గుణములు లేవు. శుద్ధ సత్త్వంతో ఉంటాడు. ‘ఈశ్వరా వీడు నీ భక్తులలో అగ్రేసరుడు అవుతాడు. బాణాసురుడు అంటే గొప్ప శివభక్తుడని చెప్పుకుంటారు. ఎక్కడ అసురసంధ్య వేళలో బాణాసురుని చరిత్ర, ఉష అనిరుద్ధుల చరిత్ర చెప్పుకుంటారో అక్కడ విజయములు సంభవిస్తాయి. అందుకని నాలుగు చేతులతో వీనిని వదిలేస్తున్నాను. నీ పరివారంలో వీడు అగ్రేసరుడు అవుతాడు. ఇంకా ఎప్పుడూ ప్రమాదముతో కూడిన ప్రవర్తన వీడియందు ఉండదు’ అని ఆరోజున కృష్ణ భగవానుడు వరం ఇచ్చాడు.  శంకరుడు సంతోషమును పొందాడు. ఇప్పుడు బాణాసురుడు శివుని పరివారంలో చేరిపోయాడు. కాబట్టి యిపుడు వాడు కైలాసం బయట కాపలా ఉండాలి. ఇప్పుడు అతను తన నిజస్థితిని గుర్తించాడు. సంతోషంగా శంకరుడు కైలాసం చేరుకున్నాడు. బాణాసురుడు కోటలోకి వెళ్లి అనిరుద్ధుడికి, ఉషాదేవికి వివాహం చేసి వారికి వస్త్రములు మాన్యములు ఆభరణములు బహూకరించి ఉషా అనిరుద్ధులను కృష్ణ పరమాత్మతో ద్వారక నగరమునకు సాగనంపాడు.  ఈవిధంగా ఉషాపరిణయం అనే ఘట్టము ఎన్నో రహస్యములను ఆవిష్కరించింది.

Post a Comment

0 Comments

Bottom Ad [Post Page]

Advertisement

WearYourDictionary

Random Posts

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Sed ultricies, sapien et auctor bibendum, magna urna posuere purus, at vehicula erat est ac sem.

Copyright

Copyright © 2022 BlogName.
Credits: imamuddinwp

#Advertisement Popup


SVG Icons

Social

sr7themes.eu.org

Newest Post

జాగ్వార్ ల్యాండ్ రోవర్‌లో 4 వేల ఉద్యోగులకు ఉద్వాసన ?

టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్ 'జాగ్వార్ ల్యాండ్ రోవర్' (జేఎల్ఆర్) అంతర్జాతీయ మార్కెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్...

Total Pageviews

#Advertisement


#Advertisement


Translate

Travel the world

Full width home advertisement

Advertisement

Random Post

Follow us

Pages

Author Description

Hey there! We are Colorlib, crafting beautiful free website templates and themes since 2013. Our designers push the boundaries to deliver high quality templates for bloggers, businesses, and creatives worldwide!

Post Page Advertisement [Top]

Advertisement

Climb the mountains