దేశంలో సాంకేతిక పరిజ్ఞానం దినదినాభివృద్ధి చెందుతున్నది. తాజాగా మధ్యప్రదేశ్‌కు చెందిన శాస్త్రవేత్తలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మరో అద్భుతాన్ని ఆవిష్కరించారు. పిండమార్పిడి విధానం ద్వారా రెండు ఆవు లేగలను సృష్టించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్‌పూర్ జిల్లాలోని నానాజీ దేశ్‌ముఖ్ యూనివర్సిటీ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్‌లో ఇవాళ ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. యూనివర్సిటీ వీసీ ఎస్పీ మిశ్రా మాట్లాడుతూ.. ఇది రాష్ట్ర గవర్నర్ కలల ప్రాజెక్టు అన్నారు. పిండమార్పిడి ద్వారా జంతు సంపదను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు తెలిపారు. గొడ్లశాల నుంచి అనారోగ్యంతో ఉన్న కొన్ని ఆవులను తీసుకొచ్చి ఈ పిండమార్పిడి ప్రక్రియ చేపట్టామని చెప్పారు. ఈ ప్రక్రియలో సహివాల్ జాతికి చెందిన ఆవుల జీన్ ప్లాస్మాను ఉపయోగించినట్లు వెల్లడించారు. రెండు పిండాలను ఉపయోగించగా.. ఇవాళ రెండు ఆవు లేగలు జన్మించాయన్నారు.ఈ పద్ధతిలో మేలు జాతి ఆవులను సృష్టించడం ద్వారా పశుసంపదను, పాల ఉత్పత్తిని పెంచుకోవచ్చని యానిమల్ బయోటెక్నాలజీ సెంటర్ డైరెక్టర్ ఏపీ సింగ్ చెప్పారు. స్థానిక ఆవులు రోజుకు ఒకటి రెండు లీటర్ల పాలు మాత్రమే ఇస్తాయన్నారు. పిండమార్పిడి విధానాన్ని ఉపయోగించి స్థానిక ఆవుల నుంచి సహివాల్ జాతి ఆడ లేగలను సృష్టించడం ద్వారా గణనీయంగా పాల ఉత్పత్తిని పెంచవచ్చాన్నారు. సహివాల్ జాతి ఆవులు రోజుకు ఒకటి రెండు నుంచి 13, 14 లీటర్ల వరకు పాలు ఇస్తాయని ఏపీ సింగ్ చెప్పారు. ఈ పిండ మార్పిడి సాంకేతికతను ఉపయోగించి భవిష్యత్తులో మరిన్ని సహివాల్ జాతి ఆవు లేగలను సృష్టించాలని భావిస్తున్నట్లు తెలిపారు.
0 Comments