యాపిల్, ఇతర అంతర్జాతీయ బ్రాండ్ల కోసం స్మార్ట్‌ఫోన్లను తయారు చేసే ఫాక్స్‌కాన్ విద్యుత్ కార్ల తయారీలోకి అడుగుపెట్టింది. ఫాక్స్‌కాన్.. విద్యుత్ కార్లను ఉత్పత్తి చేసే ప్రణాళికలను ప్రకటించింది. కాంట్రాక్టు పద్ధతిలో వాహన సంస్థల కోసం విద్యుత్ కార్లను ఫాక్స్‌కాన్ తయారు చేయనుంది. చైనా, ఉత్తర అమెరికా, ఐరోపా, ఇతర మార్కెట్లలో వాహన సంస్థలకు కార్లు, బస్సులను ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ ఉత్పత్తి చేస్తుందని సంస్థ ఛైర్మన్ యంగ్ లూ వెల్లడించారు. మార్కెట్‌కు అనుగుణంగా ఖాతాదారులు డిజైన్, ఫీచర్లను మార్చుకోవచ్చని తెలిపారు. హాన్ హయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీగా సుపరిచిమైన ఫాక్స్‌కాన్.. విద్యుత్ వాహనాల ఉత్పత్తి కోసం పలు వాహన సంస్థలు, ప్రతిష్ఠాత్మక స్టార్టప్ కంపెనీలతో చర్చలు జరుపుతోంది. ఇటలీ సంస్థ పినిన్‌ఫార్నియా అభివృద్ధి చేసిన 'ఇ సెడాన్' మోడల్‌ను 2023లో విడుదల చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఐదు సీట్లు కలిగిన 'మోడల్ ఇ'ను ఒకసారి ఛార్జ్ చేస్తే 750 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చని కంపెనీ చెబుతోంది. ఫాక్స్‌కాన్ ఖాతాదారులుగా ఫిస్కర్, తైవాన్ సంస్థ యూలాంగ్ గ్రూప్‌లు ఉన్నట్లు లూ పేర్కొన్నారు. ఇతర ఖాతాదారులుగా స్టెల్లాంటిస్, ఫియట్ క్రిస్లర్, పిజియోట్‌ల విలీన సంస్థలు ఉండవచ్చని తైవాన్ పత్రిక పేర్కొంది. కానీ దీన్ని లూ ధ్రువీకరించలేదు. ఫాక్స్‌కాన్ మొదటి విద్యుత్ బస్సు 'మోడల్ టీ'పై ఒకసారి ఛార్జింగ్‌తో 400 కి.మీ వరకు ప్రయాణం చేయవచ్చని తెలిపింది.
0 Comments