ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఉ.కొరియా మరో క్షిపణి పరీక్ష నిర్వహించింది. భవిష్యత్తులో ద.కొరియాతో శాంతి చర్చలు జరుగుతాయని ఉ.కొరియా గత శనివారం ఆశాభావం వ్యక్తంచేసింది. ఇది జరిగిన నాలుగు రోజుల్లోనే మళ్లీ బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించడం గమనార్హం.ఈ పరీక్షపై సియోల్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఓ ప్రకటన చేశారు. గుర్తు తెలియని ప్రొజెక్టైల్‌ను ఉ.కొరియా భూభాగం నుంచి తూర్పువైపు సముద్రంలోకి ప్రయోగించారని దానిలో వెల్లడించారు. ఈ ఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకొంది. అమెరికా-ద.కొరియా ఇంటెలిజెన్స్ అధికారులు దీనిని విశ్లేషిస్తారని పేర్కొన్నారు. జపాన్ కూడా ద.కొరియా ప్రకటనను ధ్రువీకరించింది. ఉ.కొరియా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు అనుమానం వ్యక్తం చేసింది. ఈ నెల మొదట్లో ఉ.కొరియా బాలిస్టిక్, క్రూజ్ క్షిపణులను ప్రయోగించింది. గత శుక్ర, శనివారాల్లో ఉ.కొరియా నియంత కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ మాట్లాడుతూ నిబంధనలు పూర్తి చేస్తే చర్చలు, ఇతర చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. మర్నాడు ఆమె మరోసారి ద.కొరియాపై ప్రకటన చేశారు. పొరుగు దేశం ఉద్రిక్తతలు పెంచే విధానాలను, ద్వంద్వ వైఖరిని ఆపేయాలని ఆమె కోరారు. దీనికి దక్షిణ కొరియా యూనిఫికేషన్ మంత్రి స్పందిస్తూ కిమ్ యో జోంగ్ ప్రకటన అర్థవంతంగానే ఉన్నా.. చర్చలకు ముందే ఇరు దేశాల కమ్యూనికేషన్లను పునరుద్ధరించాలని సూచించారు. దీనికి ఉ.కొరియా స్పందించలేదు. ఈ నేపథ్యంలో నేడు బాలిస్టిక్ క్షిపణి పరీక్ష చేసింది.
0 Comments