కేంద్ర ప్రభుత్వ విధానాల వలన అంతంత మాత్రంగా జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియకు మరో అడ్డంకి ఏర్పడింది. కరోనా టీకా కోసం వినియోగించే ఆటోడిజేబుల్ సిరంజీ(ఏడీ) లభ్యత చాలా తక్కువగా ఉంది. దీంతో కరోనా టీకా కార్యక్రమంపై దాని ప్రభావం పడనుంది. కేంద్రం వ్యాక్సిన్ డోసుల సంఖ్యకు సరిపోయే సిరంజీలు పంపిణి చేయడం లేదు. దీంతో రాష్ట్రాలే సిరంజీలను కొనుగోలు చేసుకోవాల్సి వస్తుంది. భారీఎత్తున వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టే సమయంలో వ్యాక్సిన్ కంటే సిరంజీల సేకరణ కష్టంగా మారిందని వైద్యవర్గాలు చెబుతున్నాయి. కొవిడ్ టీకా కార్యక్రమానికి తగినంతగా సిరంజీలు లేకపోవడంతో కొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్‌కు ఆటంకం ఏర్పడింది. ఇటీవల అన్ని రాష్ట్రాలతో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ నిర్వహించిన వీడియో కాన్ఫెరెన్స్‌లో ఈ అంశాన్ని కేరళ, ఒడిసా, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలు కేంద్రం దృష్టికి తీసుకువచ్చాయి. వీలైనంత త్వరగా సిరంజీలను పంపాలని కోరాయి. కేంద్ర ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం వలనే ఈ కొరత ఏర్పడిందని విమర్శలు వస్తున్నాయి.
0 Comments